Vijayawada: రూ.30 లక్షలు ఆశ చూపి.. కిడ్నీ కొట్టేసిన ముఠా

విజయవాడ కేంద్రంగా మరోసారి కిడ్నీ రాకెట్‌ ముఠా మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీ విక్రయానికి అంగీకరిస్తే.. కిడ్నీ తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా తనను మోసం చేశారని గుంటూరు జిల్లా కొండా వెంకటప్పటయ్యకాలనీకి చెందిన బాధితుడు మధుబాబు వాపోయారు.

Updated : 09 Jul 2024 06:56 IST

విజయవాడ కేంద్రంగా కిడ్నీ రాకెట్‌ ముఠా మోసాలు
గుంటూరు ఎస్పీ కార్యాలయంలో బాధితుడి ఫిర్యాదు 

కుడివైపు కిడ్నీ తీసుకున్నట్లు చూపిస్తున్న మధుబాబు

గుంటూరు నేరవార్తలు, విజయవాడ(సూర్యారావుపేట), న్యూస్‌టుడే: విజయవాడ కేంద్రంగా మరోసారి కిడ్నీ రాకెట్‌ ముఠా మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీ విక్రయానికి అంగీకరిస్తే.. కిడ్నీ తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా తనను మోసం చేశారని గుంటూరు జిల్లా కొండా వెంకటప్పటయ్యకాలనీకి చెందిన బాధితుడు మధుబాబు వాపోయారు. ఈ మేరకు సోమవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ముఠా చేసిన మోసాన్ని విలేకర్లకు వివరించారు. ‘నాకు వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివిధ వ్యాపారాలు చేసి నష్టపోయాను. కొవిడ్‌ సమయంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా అప్పులు చేశాను. అదే సమయంలో ఫేస్‌బుక్‌లో బాషా అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కిడ్నీ ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పాడు. అప్పులు తీర్చడంతో పాటు కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని అంగీకరించాను. బాషా ద్వారా మధ్యవర్తి వెంకట్‌తో మాట్లాడాను. తన వద్ద రోగి ఉన్నాడు.. అతనికి కిడ్నీ ఇస్తే రూ.30 లక్షలు ఇప్పిస్తానని నమ్మించాడు. చివరికి రోగి బావ సుబ్రహ్మణ్యాన్ని నాకు పరిచయం చేశారు. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అన్నీ రోగికి సరిపోయేలా ఉండటంతో తొలుత రూ.59 వేలు ఇచ్చారు’ అని మధుబాబు వెల్లడించారు. 

నకిలీ పత్రాలతో..

‘కిడ్నీ ఇవ్వాలంటే సమీప బంధువుగా ఉండాలని నా ఆధార్‌కార్డును వారికి అనుకూలంగా మార్పించారు. నాకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఫ్యామిలీ సర్టిఫికెట్‌ కోసం నకిలీ పత్రాలు సృష్టించారు. ఎడమవైపు కిడ్నీ తీసుకుంటామని చెప్పి గత నెల 15న శస్త్రచికిత్స చేశారు. స్పృహ వచ్చిన తర్వాత చూస్తే కుడివైపు ఉన్న కిడ్నీని వెంకటస్వామి అనే వ్యక్తికి మార్పిడి చేశారు. ఒప్పందం ప్రకారం రూ.30 లక్షలు కాకుండా.. రూ.50 వేలు మాత్రమే ఇచ్చారు. ఇదేంటని రోగి బంధువు సుబ్రహ్మణ్యం, మధ్యవర్తి వెంకట్, వైద్యుడు శరత్‌బాబును అడిగితే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కిడ్నీ తీసినవాళ్లం.. ప్రాణాలు తీయడం లెక్క కాదు అని బెదిరించారు’ అని మధుబాబు చెప్పారు.

ఆరోపణల్లో నిజం లేదు: డాక్టర్‌ శరత్‌బాబు

ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూనే మూత్రపిండాల మార్పిడి చికిత్స నిర్వహించామని శరత్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ అధినేత డాక్టర్‌ జి.శరత్‌బాబు వెల్లడించారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం కంచడం గ్రామానికి చెందిన కేతినేని వెంకటస్వామికి గత నెలలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశాం. వెంకటస్వామి కుటుంబ మిత్రుడైన మధుబాబు మూత్రపిండం దానం చేశారు. కిడ్నీ విక్రయాలపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు’ అని శరత్‌బాబు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని