Guntur: కిడ్నీ రాకెట్‌ ముఠా మోసాలపై దర్యాప్తు ముమ్మరం

కిడ్నీ రాకెట్‌ ముఠా మోసాలపై గుంటూరు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Published : 10 Jul 2024 03:14 IST

గుంటూరు పశ్చిమ డీఎస్పీ మహేష్‌ ప్రత్యేక విచారణ 

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: కిడ్నీ రాకెట్‌ ముఠా మోసాలపై గుంటూరు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రూ.30 లక్షలు ఇస్తామని నమ్మించి తన కిడ్నీ తీసుకొని డబ్బులు ఇవ్వకుండా మోసగించారని గుంటూరుకు చెందిన బాధితుడు గార్లపాటి మధుబాబు సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ముఠా సభ్యులైన బాషా, వెంకట్, సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ శరత్‌బాబు, రోగి వెంకటస్వామి తనను మోసగించారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎస్పీ తుషార్‌ దూడీ ప్రత్యేక దర్యాప్తునకు గుంటూరు పశ్చిమ డీఎస్పీ మహేష్‌ను ఆదేశించారు. నగరంపాలెం పోలీసుస్టేషన్‌ వద్ద ఉన్న బాధితుడితో డీఎస్పీ మంగళవారం మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం నగరంపాలెం సీఐ మధుసూదనరావును కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కేసును పోలీసు అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా అతన్ని మోసం చేసి కిడ్నీ మార్పిడి చేయడం, అందుకు నకిలీ పత్రాలు సృష్టించడం తదితర నేరపూరితమైన చర్యలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు నగరంపాలెం సీఐ మధుసూదనరావు తెలిపారు. 

ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తాం: డీఎస్పీ మహేష్‌

‘బాధితుడు మధుబాబు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నాం. కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తాం’ అని డీఎస్పీ మహేష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని