Andhra news: వీటీపీఎస్‌లో తెగిన లిఫ్ట్‌ వైరు.. ఇద్దరు మృతి

ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

Updated : 18 Mar 2023 12:16 IST

విజయవాడ: ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ థర్మల్‌ పవర్‌స్టేషన్‌లో లిఫ్ట్‌ వైరు తెగడంతో అది అమాంతం కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృత్యువాతపడ్డారు. మరికొంత మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఎనిమిది మంది ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వీటీపీఎస్‌ సిబ్బంది, కార్మికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎన్టీపీఎస్‌లో ఐదో స్టేజి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మెయింటీనెన్స్‌ కోసం గతంలో ఏర్పాటు చేసిన లిఫ్టులో ఈ రోజు ఉదయం సుమారు 8.45గంటల సమయంలో పరిమితికి మించి కార్మికులు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, లిఫ్టు లోడ్‌ ఎక్కువై పనిచేయకపోవడంతో కొందరు దిగి పోగా.. ఇద్దరు మాత్రం అందులోనే ఉండిపోయినట్టు పలువురు పేర్కొంటున్నారు. ఆ సమయంలో మళ్లీ లిఫ్టు పైకి వెళ్లే క్రమంలో వైరు తెగిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు ఎన్టీపీఎస్‌ అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరు కార్మికుల మృతదేహాలను వీటీపీఎస్‌ బోర్డు ఆస్పత్రికి తరలించారు. గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పటికీ వీటీపీఎస్‌ యాజమాన్యం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోందని.. కార్మికుల భద్రతను గాలికొదిలేస్తోందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. మృతుల వయస్సు 23-24 ఏళ్ల మధ్యే ఉంటుందని.. వీరంతా ఝర్ఖండ్‌కు చెందిన వారిగా భావిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు