loan apps: దారుణ యాప్‌లు

హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగి రుణయాప్‌ ద్వారా అప్పు తీసుకున్నాడు. వాయిదాలు చెల్లించలేకపోవడంతో తొలుత అతడి ఫోన్‌లోని కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి డేటింగ్‌ యాప్‌లలో పెట్టారు.

Published : 11 Jul 2024 04:46 IST

పెచ్చుమీరుతున్న రుణసంస్థల ఆగడాలు
అప్పు తీసుకున్న వ్యక్తితోపాటు సన్నిహితులు, మిత్రులకూ వేధింపులు
ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. పరువు తీసే వ్యూహం
పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం నామమాత్రమే

  • హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగి రుణయాప్‌ ద్వారా అప్పు తీసుకున్నాడు. వాయిదాలు చెల్లించలేకపోవడంతో తొలుత అతడి ఫోన్‌లోని కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి డేటింగ్‌ యాప్‌లలో పెట్టారు. అంతటితో ఆగకుండా కాంటాక్టు లిస్టులోని నంబర్ల ఆధారంగా ఆయన స్నేహితులకు ఫోన్‌ చేసి వేధించడం మొదలు     పెట్టారు. దాంతో వారంతా కలిసి అప్పు చెల్లించాల్సి వచ్చింది.
  • హైదరాబాద్‌ ఎల్బీనగర్‌కు చెందిన 66 ఏళ్ల వృద్ధురాలి ఇంటి ముందు ఉండే మహిళ లోన్‌యాప్‌ ద్వారా రుణం తీసుకుంది. వాయిదాలు చెల్లించకపోగా అప్పుల బాధ తట్టుకోలేక ఇల్లు ఖాళీ చేసింది. మహిళ జాడ తెలియక లోన్‌యాప్‌ నిర్వాహకులు ఆమె ఫోన్లోని కాంటాక్టు లిస్టులో ఉన్న నంబర్ల ఆధారంగా వృద్ధురాలిని వేధించడం మొదలుపెట్టారు. రుణం కట్టించండి.. లేదంటే మీరే చెల్లించండి అంటూ వాదనకు దిగడమేకాదు అసభ్యంగా మాట్లాడారు. ఆవేదనకు గురైన వృద్ధురాలు పోలీసులను సంప్రదిస్తే ఇలాంటి కేసులు రోజుకు పదుల్లో వస్తున్నాయి.. ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. చివరకు ఆ వృద్ధురాలు ఫోన్‌ నంబర్‌ మార్చుకోవాల్సి వచ్చింది.

ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ఎన్ని ఆరోపణలు వస్తున్నా రాష్ట్రంలో రుణయాప్‌ల ఆగడాలకు అడ్డుకట్ట పడటంలేదు. బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పోలీసులు జోక్యం చేసుకుంటున్నారు. దాంతో రుణయాప్‌ల నిర్వాహకులు మరింత రెచ్చిపోతున్నారు. రుణం తీసుకున్న వారి కాంటాక్ట్‌ లిస్టులోని నంబర్లకు ఫోన్లు చేసి వేధిస్తున్నారు. వారి అప్పు మీరు కట్టాలని అడ్డగోలు వాదనలకు దిగుతున్నారు. తమకేమీ సంబంధం లేదని చెబుతున్నా వినకుండా బూతులు తిడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫోన్‌ ఆఫ్‌ చేసి పెట్టుకోవడమో, నంబర్‌ మార్చుకోవడమో చేయాల్సి వస్తోంది. ఇక రుణం తీసుకున్న వారికి వేధింపులు సరేసరి. రుణగ్రహీత ఫోన్లోని ఫొటోలు, కాంటాక్టు లిస్టు వంటివన్నీ ముందే తస్కరించి పెట్టుకుంటారు. ఫొటోలను మార్ఫింగ్‌ చేసి పోర్న్‌ సైట్స్‌లో పెడతారు. ఈ లింకులను రుణగ్రహీత బంధుమిత్రులకు పంపుతారు. ఫోన్‌ చేసి దారుణంగా బూతులు తిడతారు. వీరి ఆగడాలు తట్టుకోలేక గత ఏడాది రాష్ట్రంలో 25 మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. చాలా మంది వేధింపులను బయటకు చెప్పుకోలేకపోతున్నారు. 

వందయాప్‌లు.. రూ.21 వేల కోట్లు 

రూపాయి రుణం ఇచ్చి పది రూపాయలు వసూలు చేస్తుండటంతో ఈ వ్యాపారం రూ.వేల కోట్లకు చేరింది. హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ విభాగమే దాదాపు వంద రుణయాప్‌లపై దర్యాప్తు జరుపుతోంది. వీటి ద్వారా జరిగిన బ్యాంకు లావాదేవీల విలువ అక్షరాలా రూ.21వేల కోట్లు అంటే ఈ దందా ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో చైనాకు చెందిన డోకీపే అనే యాప్‌ ఒక్కటే రుణ గ్రహీతల నుంచి అసలు, వడ్డీ కలిపి  రూ.1,268 వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. 

దొరికేది చిరుద్యోగులే

రుణ వసూలు బాధ్యతను యాప్‌లు కాంట్రాక్టు సంస్థకు అప్పగిస్తున్నారు. వీరు తక్కువ వేతనంతో ఉద్యోగులను నియమించుకుంటున్నారు. తమకు ఇచ్చిన నంబర్‌కు ఫోన్‌ చేసి బూతులు తిట్టడం, అడ్డగోలుగా వాదించడమే వీరి పని. ఒకవేళ బాధితులు పిర్యాదు చేసినా చిరుద్యోగులే దొరుకుతున్నారు. అసలు దొంగలు మాత్రం చైనాలో ఉంటున్నారు. 

అడ్డుకోలేక ఆపసోపాలు

వేధింపులపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నా.. అసలు నిందితులే కాదు యాప్‌ల సర్వర్లు కూడా విదేశాల్లో ఉండటంతో వారు కూడా ఏమీచేయలేకపోతున్నారు. దాంతో ఇలాంటి సంస్థల ద్వారా రుణాలు తీసుకోవద్దని ప్రచారం చేయడానికే వారు పరిమితమవుతున్నారు. ఎవరికివారు నియంత్రణ పాటించడం మినహా మార్గం లేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.


యాప్‌ల పేరుతో ఫోన్‌ చేసినా భయపడొద్దు
- ఎల్బీనగర్‌ డీసీపీ సీహెచ్‌ ప్రవీణ్‌కుమార్‌

చిన్నచిన్న ఆర్థిక అవసరాల కోసం లోన్‌యాప్‌లను ఆశ్రయించొద్దు. అడిగినంత డబ్బు ఇచ్చి సమస్యల్లో పడేయడమే వాటి నిర్వాహకుల వ్యూహం. వారి వలలో పడి సమస్యల్లో చిక్కుకోవద్దు. నేరగాళ్లు అనేక సందర్భాల్లో డబ్బు తీసుకున్న వ్యక్తితో పాటు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకూ ఫోన్లు చేస్తూ.. సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. అలా ఎవరైనా ఫోన్‌ చేసినా, సందేశాలు పంపించినా భయపడొద్దు. ఆందోళనలో వారు చెప్పినట్లు నడుచుకుంటూ సమస్యల్లో పడొద్దు. అలాంటి ఫోన్లు వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా డయల్‌ 100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి.. లేదా సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి.


ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని