Kerala: నటిపై అత్యాచారం కేసు.. పరారీలో మలయాళీ నటుడు?

నటిపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మలయాళ  సినీ నటుడు, నిర్మాత విజయ్‌ బాబుపై పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

Published : 29 Apr 2022 02:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటిపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మలయాళ  సినీ నటుడు, నిర్మాత విజయ్‌ బాబుపై పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అతను దేశం విడిచి పరారయ్యాడని వారు అనుమానిస్తున్నారు. కేరళ రాష్ట్రం వెలుపలా అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టుగా సమాచారం అందుతోంది.

ఈ నెల 22న బాధితురాలు ఎర్నాకులం పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.  ఓ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో.. విజయ్‌ బాబు గత నెలన్నరగా శారీరకంగా, లైంగికంగా తనను వేధింపులకు గురిచేశాడని పేర్కొంది. నటిగా అవకాశాలిచ్చి వృత్తిపరంగా, వ్యక్తిగతంగా  సహాయపడుతున్నట్టుగా నటిస్తూ తనకు దగ్గరయ్యాడని తెలిపింది. స్నేహం, ప్రేమ ముసుగులో తనను శారీరకంగా వేధించాడని, మత్తుమందిచ్చి అత్యాచారానికి ఒడిగట్టాడని వివరించింది. మద్యం, మత్తు పదార్థాలు సేవించాలని తనను బలవంతం చేశాడని ఆరోపించింది.

ఈ ఆరోపణలను విజయ్‌ బాబు మంగళవారం ఫేస్‌బుక్‌ లైవ్‌ వీడియో ద్వారా ఖండించాడు. సదరు నటి తనకు ఐదేళ్లుగా తెలుసునని, ఈ విషయంలో తానే నిజమైన బాధితుడినని తెలిపాడు. అందుకు ఆమెపై పరువునష్టం దావా వేస్తానని తెలిపాడు. అప్పటికే ఈ ఘటనలో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సామాజిక మాధ్యమాల వేదికగా బాధితురాలి వ్యక్తిగత వివరాలు బయటపెట్టి ఆమె గోప్యతకు భంగం కలిగించిన కారణంగా రెండో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని