బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య.. 16సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు

పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ ప్రియుడు తన ప్రియురాలిని అత్యంత దారుణంగా పొడిచి చంపిన ఘటన బెంగళూరు (Bengaluru)లో కలకలం రేపింది. మృతురాలి స్వస్థలం కాకినాడ.

Updated : 01 Mar 2023 17:23 IST

యశ్వంతపుర (బెంగళూరు): కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) నగరంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి లీలా పవిత్ర (28) దారుణ హత్య (Murder)కు గురైంది. తనను దూరం పెట్టి వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైందన్న కోపంతో ఆమె ప్రియుడు అత్యంత కిరాతంగా ఆమెను పొడిచి చంపేశాడు. బెంగళూరు నగరంలోని జీవనబీమా నగర పోలీసు స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి 7.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

లీలా పవిత్ర స్వస్థలం కాకినాడ (Kakinada). ఉద్యోగం నిమిత్తం బెంగళూరు వెళ్లి దొమ్లూర్‌లోని ఓ ప్రైవేటు లాబోరేటరీలో పనిచేస్తోంది. అదే లాబోరేటరీలో ఉద్యోగం చేస్తోన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివాకర్‌ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. గత ఐదేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వీరి బంధం గురించి లీలా తన ఇంట్లో వాళ్లకు చెప్పగా.. పెళ్లికి వారు అంగీకరించలేదు. దీంతో గత రెండు నెలల నుంచి లీలా.. దివాకర్‌ను దూరం పెడుతూ వస్తోంది. ఇటీవల ఆమెకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైందని తెలుసుకున్న ప్రియుడు ఆమెపై కోపం పెంచుకున్నాడు.

మంగళవారం రాత్రి విధులు ముగించుకుని బయటకు వచ్చిన లీలాపై ఆఫీసు బయటే కత్తితో దాడిచేశాడు. సహోద్యోగులు చూస్తుండగానే పలుమార్లు విచక్షణారహితంగా పొడిచాడు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దివాకర్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన లీలాను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె ఒంటిపై 16 చోట్ల కత్తితో పొడిచిన గాయాలున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బెంగళూరు (Bengaluru) పోలీసులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని