Sai Dharam Tej: ప్రమాద సమయంలో సాయిధరమ్‌ తేజ్‌  బైక్‌ 75కి.మీ వేగంతో ఉంది: డీసీపీ

సినీనటుడు సాయిధరమ్‌ తేజ్‌ నడిపిన ద్విచక్రవాహనం అనిల్‌ కుమార్‌ పేరుతో ఉందని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ..

Updated : 11 Sep 2021 22:38 IST

హైదరాబాద్‌: సినీనటుడు సాయిధరమ్‌ తేజ్‌ నడిపిన ద్విచక్రవాహనం అనిల్‌ కుమార్‌ పేరుతో ఉందని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. సాయితేజ్‌ ప్రమాద ఘటనపై డీసీపీ మీడియాతో మాట్లాడారు. ‘‘ఎల్బీనగర్‌కు చెందిన అనిల్‌ నుంచి ట్రంప్‌ బైక్‌ను సాయితేజ్‌ కొనుగోలు చేశారు. వాహనం మాత్రం ఇంకా అనిల్‌ పేరు మీదే ఉంది. సాయితేజ్‌ పేరు మీద మార్చుకోలేదు. గతేడాది ఆగస్టు 2న అతివేగంగా వెళ్లినందుకు ట్రంప్‌ బైక్‌పై 1,135 రూపాయల జరిమానా పడింది. ఈరోజు ఆ చలానా డబ్బులను ఎవరో చెల్లించారు. అతివేగం, నిర్లక్ష్యంగా బైక్‌ నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకుంది. సాయితేజ్‌కు కారు నడిపేందుకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంది. ద్విచక్రవాహనాలు నడిపేందుకు లైసెన్స్‌ ఉందా? లేదా? అనే వివరాలు సేకరిస్తున్నాం. సాయితేజ్‌ ప్రమాదానికి గురైన రహదారిపై 30 కి.మీ పరిమిత వేగంతో వెళ్లాలి. కానీ, తీగల వంతెనపై సాయితేజ్‌ బైక్‌ 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బైక్‌ 75 కి.మీ వేగంతో ఉంది. దుర్గం చెరువు తీగల వంతెన నుంచి ఐకియా మీదుగా గచ్చిబౌలి వెళ్లే దారిలో వేగ పరిమితికి సంబంధించి తగిన బోర్డులు ఏర్పాటు చేశాం. మాదాపూర్‌ జోన్‌ పరిధిలో రహదారి ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మాదాపూర్‌ జోన్‌ పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 17,917 ద్విచక్రవాహనాలపై పరిమితికి మించి వేగంతో వెళ్లినందుకు జరిమానా విధించాం. 5,495 మంది ద్విచక్ర వాహనదారులపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశాం’’ అని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని