Crime: కళ్లల్లో కారం కొట్టి.. కర్రలతో దాడి చేసి.. ప్రొఫెసర్‌పై విద్యార్థుల దుశ్చర్య

తప్పుడు పనులు చేయొద్దని వారించినందుకు కక్ష పెంచుకున్న కొందరు విద్యార్థులు ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది.   

Updated : 15 Jun 2024 19:53 IST

భోపాల్‌:  ప్రొఫెసర్‌(Professor)పై విద్యార్థులు కారం చల్లి, కర్రలతో దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్‌(Madhya pradesh) లోని ప్రభుత్వ జేహెచ్ పీజీ కళాశాలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం సాయంత్రం ఏడుగురు విద్యార్థుల గుంపు కారం పొడి, కర్రలతో కళాశాలలోకి వచ్చారు. అనంతరం ఓ తరగతి గదిలోకి ప్రవేశించి అక్కడ విద్యార్థులకు క్లాస్‌ చెబుతున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నీరజ్‌ ధాకడ్‌(Neeraj Dhakad)పై ఒక్కసారిగా దాడికి దిగి కళ్లల్లో కారం చల్లి, కర్రలతో కొట్టారు.

ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న విద్యార్థులు, ఇతర అధ్యాపకులు దాడి చేస్తున్నవారిని ఆపడానికి ప్రయత్నించారు. నీరజ్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు తీవ్ర గాయాలైనట్లుగా వైద్యులు పేర్కొన్నారు. దాడి దృశ్యాలు రికార్డ్‌ అయిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారిని అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 

ఇటీవల కళాశాల స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన అవకతవకలపై ప్రొఫెసర్ నీరజ్‌కు, కళాశాల పూర్వ విద్యార్థి అన్నూ ఠాకూర్ (Annu Thakur) మధ్య వాగ్వాదం జరిగిందని కళాశాల యాజమాన్యం తెలిపింది. ప్రొఫెసర్‌ సంతకాన్ని, కాలేజీ స్టాంప్‌ను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించిన ఠాకూర్‌ను నీరజ్‌ వారించారని ఇది వారి మధ్య ఘర్షణకు దారితీసిందని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని