Crime News: మెయిల్‌ హ్యాక్‌ చేసి రూ.11.4 కోట్లకు టోకరా

బ్యాంకు ఖాతాలు మారాయంటూ ఓ సంస్థకు సైబర్‌ నేరస్థులు నకిలీ మెయిల్‌ పంపించారు. దాన్ని నమ్మిన సంస్థ నిర్వాహకుల నుంచి రూ.11.4 కోట్లు కొట్టేశారు. హైదరాబాద్‌లో ఈ ఉదంతం వెలుగుచూసింది.

Published : 08 Jul 2024 08:28 IST

నగరంలోని ఫార్మా సంస్థను మోసగించిన సైబర్‌ నేరస్థులు

ఈనాడు, హైదరాబాద్‌: బ్యాంకు ఖాతాలు మారాయంటూ ఓ సంస్థకు సైబర్‌ నేరస్థులు నకిలీ మెయిల్‌ పంపించారు. దాన్ని నమ్మిన సంస్థ నిర్వాహకుల నుంచి రూ.11.4 కోట్లు కొట్టేశారు. హైదరాబాద్‌లో ఈ ఉదంతం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. రాయదుర్గం నాలెడ్జ్‌సిటీలోని ఓ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ ఆంకాలజీ, ఆప్తాలమిక్స్, హార్మోనల్‌ ఉత్పత్తుల్ని తయారుచేస్తుంది. ఈ కంపెనీలో అంతర్గత నాణ్యత నియంత్రణ వ్యవహారాలు, సంస్థకు ముడిసరకును సరఫరా చేసే వారికి ఆన్‌లైన్‌లో డబ్బులు పంపించే ప్రక్రియను ఓ లైఫ్‌సైన్సెస్‌ సంస్థ చూస్తుంది. ఈ క్రమంలో గత మే 11న లైఫ్‌సైన్సెస్‌ సంస్థ పేరిట ఫార్మా కంపెనీకి ఓ మెయిల్‌ వచ్చింది. తమ సంస్థ బ్యాంకు ఖాతాలు మారాయని, కంపెనీ నుంచి రావాల్సిన సొమ్మును వేరే రెండు బ్యాంకు ఖాతాలకు పంపించాలనేది దాని సారాంశం. దీంతో కంపెనీ నిర్వాహకులు మెయిల్‌లో సూచించిన ఖాతాలకు 1367195 అమెరికన్‌ డాలర్లను పంపించారు. అదే నెల 16న ముడిసరకు సరఫరాదారులకు ఇంకా పేమెంట్‌ అందలేదంటూ లైఫ్‌సైన్సెస్‌ సంస్థ నుంచి ఫార్మా కంపెనీకి ఫోన్‌ వచ్చింది. మెయిల్‌లో మీరు సూచించిన రెండు బ్యాంకు ఖాతాలకు ఐదు రోజుల క్రితమే డబ్బులు పంపించామని కంపెనీ ప్రతినిధులు బదులిచ్చారు. తాము ఎలాంటి మెయిల్‌ పంపలేదని లైఫ్‌సైన్సెస్‌ సంస్థ ప్రతినిధులు చెప్పడంతో ఫార్మా కంపెనీ ప్రతినిధులు కంగుతిన్నారు. హ్యాకర్లు తప్పుడు మెయిల్‌ పంపించి రూ.11.4 కోట్లు తస్కరించినట్లు గుర్తించిన ఫార్మా కంపెనీ ప్రతినిధులు ఇటీవల తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ)కి ఫిర్యాదు చేశారు. దీనిపై టీజీసీఎస్‌బీ దర్యాప్తు చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని