BMW hit-and-run case: ప్రమాదసమయంలో మిహిర్‌ షా మద్యం మత్తులో ఉన్నాడు: పోలీసులు

బీఎండబ్ల్యూ కారు ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటన సమయంలో ప్రధాన నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. 

Updated : 11 Jul 2024 18:30 IST

BMW Hit And Run|ముంబయి: బీఎండబ్ల్యూ కారుతో ఢీకొట్టి ఓ మహిళ మృతికి కారణమైన హిట్‌ అండ్‌ రన్‌ కేసులో  ముంబయి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, శివసేన (శిందే వర్గం) నేత రాజేష్‌ షా తనయుడు మిహిర్‌ షాను విచారిస్తున్న పోలీసులు.. గురువారం పలు కీలక అంశాలను వెల్లడించారు.  ప్రమాదం జరిగిన సమయంలో మిహిర్ షా మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం సేకరించడంలో భాగంగా పోలీసులు గురువారం తెల్లవారు జామున ఘటనా స్థలం వద్ద సీన్‌ను రీక్రియేట్‌ చేశారు.

యూట్యూబర్‌ ప్రణీత్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించిన నాంపల్లికోర్టు

ఈ సందర్భంగా పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘ప్రమాదం సమయంలో మిహిర్‌ షా మద్యం మత్తులో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. బీఎండబ్ల్యూ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి, ఆపై మహిళను కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లిన ఘటనలో మరిన్ని వివరాల కోసం సీన్‌ రీక్రియేట్ చేశాం’’ అన్నారు.  మరోవైపు, ఈ కేసులో మిహిర్‌ షా కుటుంబ డ్రైవర్‌ను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కేసు విచారణలో ఉన్నందున మరికొన్ని రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా..  చీఫ్ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఎస్‌పీ భోంస్లే 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. మిహిర్‌ పోలీస్‌ కస్టడీ ఈనెల 17తో ముగియనుంది. 

సిట్‌ విచారణలో నిందితుడు మిహిర్‌ షా తన తప్పుని అంగీకరించినట్లు సమాచారం. ‘నేను చేసిన తప్పుని అంగీకరిస్తున్నా.. నా కెరీర్‌ ఇంతటితో ముగిసిపోయింది’ అని అన్నట్లు తెలుస్తోంది. శివసేన నేత రాజేశ్‌ షా కుమారుడు మిహిర్‌ షా ఇటీవల ముంబయిలోని వర్లీ ప్రాంతంలో తెల్లవారుజామున మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులైన మిహిర్‌, అతడి డ్రైవర్‌ను అరెస్టు చేసిన సిట్‌ అధికారులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని