Uttar Pradesh: యూపీలో ఘోరం.. మృతదేహాన్ని 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో దారుణం చోటుచేసుకుంది. కారు కింద చిక్కుకుపోయిన మృతదేహంతోనే ఓ వ్యక్తి 10 కిలోమీటర్లకుపైగా ప్రయాణించడం గమనార్హం.

Updated : 07 Feb 2023 16:54 IST

లఖ్‌నవూ: దిల్లీ(Delhi)లో కొంతకాలం క్రితం ఓ యువతిని కారు దాదాపు 20 కి.మీ. లాక్కెళ్లిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోనూ ఈ తరహా దారుణం చోటుచేసుకుంది. కారు కింద చిక్కుకుపోయిన మృతదేహాన్ని ఓ వ్యక్తి 10 కిలోమీటర్లకుపైగా ఈడ్చుకెళ్లాడు. మథుర(Mathura)లో యుమునా ఎక్స్‌ప్రెస్‌ వే(Yamuna Expressway)పై మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో వాహనం నడుపుతున్న దిల్లీ వాసి వీరేంద్ర సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, కారు కింద ఉన్న వ్యక్తి వేరే ప్రమాదంలో చనిపోయాడని.. కానీ, తన వాహనం కింద చిక్కుకున్నాడని నిందితుడు పేర్కొన్నాడు.

వీరేంద్ర సింగ్‌ మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆగ్రా నుంచి నోయిడాకు వెళ్తుండగా.. మథుర సమీపంలోని టోల్ గేట్‌ వద్ద అతని కారు కింద ఓ వ్యక్తి మృతదేహం ఇరుక్కుపోయి ఉన్నట్లు అక్కడి సిబ్బంది గుర్తించారు. అప్పటికే మృతదేహం ఛిద్రమైంది. అయితే, దట్టమైన పొగమంచులో దారి సరిగ్గా కనిపించలేదని, ఈ క్రమంలోనే వేరే ఇతర ప్రమాదానికి గురైన వ్యక్తి తన కారు కింద చిక్కుకుపోయినట్లు అతను పోలీసులకు తెలిపాడు. మృతదేహం ఉన్నట్లు గుర్తించలేదని చెప్పాడు. ఈ క్రమంలోనే అతన్ని అరెస్టు చేసిన పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. మృతుడు ఎవరు? ఎలా చనిపోయాడనేది గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజీలను తనిఖీ చేస్తున్నారు. సమీప గ్రామవాసులను విచారిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. నూతన సంవత్సరం వేళ దిల్లీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీ ముగించుకుని స్కూటీపై తిరిగెళ్తున్న అంజలిని ఓ కారు వేగంగా ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా 20 కిలోమీటర్లు అలాగే ఈడ్చుకెళ్లింది. దీంతో కారు చక్రాల్లో చిక్కుకుని ఆమె శరీరం ఛిద్రమైంది. ఈ ఘటనలో ఇప్పటివరకు పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఈ తరహా ఘటనలు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని