Video: ట్రాలీబ్యాగ్‌లో రూ.64లక్షల విలువైన విదేశీ కరెన్సీ తరలింపు.. ఎలా బయటకు లాగారో చూడండి!

దిల్లీ నుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న ఓ వ్యక్తి ట్రాలీ బ్యాగులో విదేశీ కరెన్సీ దాచినట్టు గుర్తించిన సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు షాక్‌ అయ్యారు. అతడి బ్యాగుకు ఉన్న ఇనుప చువ్వల్లో దాచిపెట్టిన ఈ నోట్ల కట్టలను పుట్టలోంచి పాముల్ని లాగినట్టుగా బయటకు తీశారు. 

Published : 29 Jan 2023 23:08 IST

దిల్లీ: విదేశీ డబ్బు (foreign currency), బంగారాన్ని(Gold) తరలించేందుకు స్మగ్లర్లు ఎవరి ఊహలకూ అందని రీతిలో సరికొత్త పంథాలు అనుసరిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి పుస్తకాల పేజీల మధ్య కరెన్సీ నోట్ల (90వేల విలువైన డాలర్లు)ను అతికించగా.. మరో వ్యక్తి బంగారాన్ని పేస్ట్‌ రూపంలో తరలిస్తూ ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. తాజాగా దిల్లీలో అదే తరహా ఘటన వెలుగుచూసింది. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌కు బయల్దేరిన ఓ వ్యక్తి ట్రాలీ బ్యాగులోని మెటల్‌ పైపుల్లో రూ.64లక్షల విలువైన విదేశీ కరెన్సీని దాచినట్టు గుర్తించిన అధికారులు అవాక్కయ్యారు. అతడి  బ్యాగును క్షుణ్నంగా తనిఖీ చేయగా కరెన్సీ నోట్లను ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి బ్యాగ్‌ హ్యాండిల్‌ పైపుల్లో కుక్కినట్టు గుర్తించారు. వాటిని  బయటకు లాగగా.. 68,400 యూరోలు; 5000 న్యూజిలాండ్‌ డాలర్లు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ వీడియోను తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

ఇలా వెలుగులోకి..

శనివారం అర్ధరాత్రి  1.15గంటల సమయంలో సురీందర్‌ సింగ్‌ రిహాల్‌ అనే వ్యక్తి అనుమానాస్పద ప్రవర్తనను సీఐఎస్‌ఎఫ్‌(CISF) అధికారులు గుర్తించారు. అతడు థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో బ్యాంకాక్‌కు ప్రయాణించాల్సి ఉంది. దీంతో ఆ వ్యక్తిని ర్యాండమ్‌ చెకింగ్‌కు తరలించిన సీఐఎస్‌ఎప్‌ సిబ్బంది.. ఫిజికల్‌, ఎలక్ట్రానిక్‌ సర్వైలెన్స్‌ చేశారు. అతడి డాక్యుమెంట్లలో సమస్య ఉన్నందున సీఐఎస్‌ఎప్‌ అధికారులు ఇంటర్నేషనల్‌ డిపాచర్‌ కస్టమ్స్‌ కార్యాలయానికి అతడిని తరలించి క్షుణ్నంగా తనిఖీ చేయగా విదేశీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయని సీఐఎస్‌ఎఫ్‌ వెల్లడించింది. ఇంత భారీ మొత్తంలో కరెన్సీ తరలించడానికి అవసరమైన పత్రాలు అతడి వద్ద ఏమీ లేవని పేర్కొన్నారు. అతడి నుంచి కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు చట్టపరమైన చర్యల కోసం నిందితుడిని కస్టమ్స్‌ అధికారులకుఅప్పగించినట్టు వెల్లడించారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని