AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్‌బాట్‌ రిజల్ట్‌.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!

ఏఐ(AI) ఆధారిత చాట్‌బాట్ (Chatbot) గ్లోబల్‌ వార్మింగ్‌ (Global Warming) గురించి చెప్పిన సమాధానాలతో ఆందోళన చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మరోసారి ఏఐ ఆధారిత వ్యవస్థల పనితీరుపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 01 Apr 2023 01:39 IST

బ్రస్సెల్స్‌: సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (AI) ఆధారిత చాట్‌జీపీటీ (ChatGPT) ఎంతో ఆసక్తి కలిగిస్తోంది. మరోవైపు ఏఐ కారణంగా ఉద్యోగాలకు ముప్పు ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా చాట్‌జీపీటీ తరహా చాట్‌బాట్‌ (Chatbot) చెప్పిన సమాధానాలతో ఆందోళన చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఏఐ కారణంగా జరిగిన తొలి మరణంగా దీన్ని టెక్‌ రంగ నిపుణులు భావిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే...

బెల్జియంకు చెందిన పియర్‌ (Pierre) అనే వ్యక్తి ఛాయ్‌ (Chai) అనే ఏఐ ఆధారిత యాప్‌లో ఉండే ఎలిజా (Eliza) అనే చాట్‌బాట్‌తో గత రెండేళ్లుగా చాటింగ్‌ చేస్తున్నాడు. ఈ యాప్‌ గూగుల్ ప్లే స్టోర్‌, యాపిల్ యాప్‌స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇందులో యూజర్లు తమకు నచ్చిన వాయిస్‌ను ఎంచుకుని చాట్‌ చేయొచ్చు. అలా పియర్‌.. మహిళ గొంతుతో స్పందించే ఎలిజాను ఎంచుకున్నాడు. ఈ చాట్‌బాట్‌తో రోజులో ఎక్కువ సమయం గడుపుతుండేవాడని పియర్‌ భార్య క్లెయిర్‌ (Claire) చెప్పినట్లు బెల్జియం వార్తా సంస్థ పేర్కొంది. చాట్‌బాట్‌తో చాటింగ్ చేయడం అతనికి వ్యసనంగా మారడంతో కుటుంబానికి దూరమైనట్లు ఆమె వెల్లడించారు. 

పియర్‌ తరచూ వాతావరణ మార్పులపై చాట్‌బాట్‌ను ప్రశ్నిస్తుండేవాడని క్లెయిర్‌ తెలిపింది. ఈ క్రమంలో గ్లోబల్‌ వార్మింగ్‌ (Global Warming) గురించి చాట్‌బాట్‌ చెప్పిన సమాధానాలతో ప్లియర్‌ ఆందోళన చెందేవాడని ఆమె పేర్కొంది. పర్యావరణ పరిరక్షణ బాధ్యతలు ఎలిజా చాట్‌బాట్‌ తీసుకుంటే తాను ఆత్మహత్య చేసుకోవాలనే ప్రతిపాదన చాట్‌బాట్‌ ముందుంచాడని క్లెయిర్‌ తెలిపింది. అయితే, ప్లియర్‌ ఆత్మహత్య ఆలోచనలను చాట్‌బాట్ నివారించకపోవడంతో అతను ఆత్మహత్యకు చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై ఛాయ్‌ సంస్థ స్పందించింది. యూజర్లు ఆత్మహత్య వంటి విషయాల గురించి చర్చించినప్పుడు వారి ఆలోచనలు మార్చే విధంగా సమాధానాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది. 

కొద్ది రోజుల క్రితం ఏఐతో మానవాళికి ముప్పు ఉందనే వాదనతో ఏకీభవిస్తూ ఆయా వ్యవస్థల అభివృద్ధిని నిలిపివేయాలని కోరుతూ టెక్‌ రంగ నిపుణులు ఓ లేఖను విడుదల చేశారు. ‘పాజ్‌ జియాంట్‌ ఏఐ ఎక్స్‌పెరిమెంట్స్‌’ పేరిట విడుదల చేసిన ఈ లేఖపై  ట్విటర్‌  సీఈఓ ఎలాన్‌ మస్క్‌, యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ వోజ్నియాక్‌ సహా 1,000 మందికి పైగా టెక్‌ రంగ నిపుణులు, పలు సంస్థల సీఈవోలు సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో ఏఐ చాట్‌బాట్‌ కారణంగా వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని