Fraud: మంత్రి పదవులు ఇప్పిస్తానంటూ.. ఎమ్మెల్యేలకు గాలం!

మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇప్పిస్తానంటూ ఎమ్మెల్యేలను మోసం చేసేందుకు యత్నించాడో వ్యక్తి. ఓ ఎమ్మెల్యే ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

Published : 19 May 2023 00:14 IST

ముంబయి: భాజపా (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యక్తిగత సహాయకుడినని నమ్మబలుకుతూ.. మంత్రి పదవులు ఇప్పిస్తానని ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు యత్నించాడో వ్యక్తి. చివరకు ఓ ఎమ్మెల్యే ఫిర్యాదుతో కటకటాల పాలయ్యాడు. మహారాష్ట్ర (Maharashtra)లో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన నీరజ్‌ సింగ్‌ రాథోడ్‌ అనే వ్యక్తి తనకు తాను జేపీ నడ్డా వ్యక్తిగత సహాయకుడిగా అవతారమెత్తాడు. మహారాష్ట్రలోని ఏక్‌నాథ్‌ శిందే ప్రభుత్వ తదుపరి మంత్రివర్గ విస్తరణలో కేబినెట్‌ పదవులు ఇప్పిస్తానంటూ నలుగురు భాజపా ఎమ్మెల్యేలకు ఫోన్‌ చేసి, రూ.లక్షల్లో డబ్బులు డిమాండ్‌ చేశాడు. అంతటితో ఆగకుండా.. సదరు ఎమ్మెల్యేలతో జేపీ నడ్డా మాదిరి గొంతు ఉన్న ఓ వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడించడం గమనార్హం.

అతడి తీరుపై అనుమానం వచ్చిన ఎమ్మెల్యే వికాస్ కుంభారే.. తన పీఏ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. తనను పలుమార్లు సంప్రదించి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పదవి ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నాగ్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు