Flight Thief: విమానాల్లో టక్కరి దొంగ

విమానాల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్న ఘరానా కేటుగాడు ఆర్జీఐఏ పోలీసులకు చిక్కాడు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి విమానాల్లో వెళ్తూ ఆరు చోరీలు చేసిన అతడి నుంచి కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Published : 16 Jun 2024 05:24 IST

వృద్ధ ప్రయాణికులే లక్ష్యంగా చోరీలు.. నిందితుడి అరెస్టు
శంషాబాద్‌ నుంచి ఫ్లైట్స్‌లో వెళ్తూ 6 చోరీలు.. రూ.2 కోట్ల సొత్తు అపహరణ
డీసీపీ నారాయణరెడ్డి వెల్లడి 

వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ నారాయణరెడ్డి. చిత్రంలో ఏసీపీ కేఎస్‌ రావు, ఏడీసీపీ రామ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు.. వెనుక నిందితుడు రాజేశ్‌ కపూర్‌

ఈనాడు, హైదరాబాద్‌: విమానాల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్న ఘరానా కేటుగాడు ఆర్జీఐఏ పోలీసులకు చిక్కాడు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి విమానాల్లో వెళ్తూ ఆరు చోరీలు చేసిన అతడి నుంచి కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌ అదనపు డీసీపీ రామ్‌కుమార్, ఏసీపీ కేఎస్‌ రావు, ఆర్జీఐఏ ఇన్‌స్పెక్టర్‌ బాలరాజుతో కలిసి డీసీపీ నారాయణరెడ్డి శనివారం కేసు వివరాలు వెల్లడించారు. 

దిల్లీలోని పహర్‌గంజ్‌కు చెందిన రాజేశ్‌ కపూర్‌(40) తానుండే ప్రాంతంలో మనీ ఎక్స్ఛేంజ్‌ వ్యాపారంతో పాటు సెల్‌ఫోన్‌ మరమ్మతు దుకాణం నడిపేవాడు. జల్సాలకు అలవాటుపడి చోరీల బాట పట్టాడు. గతంలో రైళ్లలో చోరీలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. జైలుకెళ్లి బయటకొచ్చినా బుద్ధి మార్చుకోలేదు. విమానాల్లో ఎక్కువగా ధనవంతులు ప్రయాణిస్తారని.. వారిని లక్ష్యంగా చేసుకుంటే ఎక్కువ డబ్బు వస్తుందని పథకం వేశాడు. ముఖ్యంగా కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌లో ప్రయాణించేవారిని.. అందులోనూ వృద్ధుల్ని లక్ష్యంగా చేసుకున్నాడు. సూటుబూటు ధరించి ధనవంతుడిలా నటిస్తూ అసలు పేరుతో కాకుండా రిషి కపూర్, యశ్‌పాల్‌ కపూర్, మహదేవ్‌ తదితర పేర్లతో విమాన టికెట్లు కొనుగోలు చేసేవాడు. ఇలా టికెట్లు కొనడానికి దిల్లీకి చెందిన దినేశ్‌ గుప్తా సాయం చేస్తూ ఉంటాడు.

110 రోజుల్లో 200 ప్రయాణాలు

నిందితుడు దొంగతనాల కోసం 2023లో 110 రోజుల వ్యవధిలో 200 ప్రయాణాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎయిర్‌పోర్టుల్లోనే తనతో పాటు ప్రయాణించే ఒంటరి మహిళలను, వృద్ధులను గమనించి మాట కలిపేవాడు. విమానంలోకి ఎక్కాక.. వారి లగేజీ పక్కనే తన సామగ్రి పెట్టేవాడు. వారు ఆదమరిచి ఉన్నప్పుడు సామగ్రి సర్దుతున్నట్లు నటించి వారి ఖరీదైన వస్తువులను కొట్టేసి తన బ్యాగులో వేసుకునేవాడు.

పట్టించిన రెండు చోరీలు

రాజేశ్‌ కపూర్‌ ఫిబ్రవరి 2న అమెరికా వెళ్లేందుకు అమృత్‌సర్‌ నుంచి దిల్లీకి కనెక్టింగ్‌ విమానంలో ప్రయాణించిన వ్యక్తి బ్యాగులోని రూ.20 లక్షల విలువైన వస్తువులు చోరీ చేశాడు. ఏప్రిల్‌ 11న హైదరాబాద్‌ నుంచి దిల్లీ వెళ్తున్న మహిళ బ్యాగులోని రూ.7 లక్షలు చోరీ చేశాడు. వాటిపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు దిల్లీ, హైదరాబాద్, అమృత్‌సర్‌ విమానాశ్రయాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఒకే వ్యక్తి మూడు చోట్లా ఉండడమే కాకుండా అతడి ప్రవర్తన అనుమానంగా కనిపించింది. సాంకేతిక వివరాలు, టికెట్‌ కోసం అతడిచ్చిన వివరాల ఆధారంగా తొలుత దిల్లీ పోలీసులు నిందితుడి ఆచూకీ గుర్తించి అరెస్టు చేశారు. విచారించినప్పుడు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి విమానాల్లో వెళ్తూ చోరీ చేసినట్లు తెలియడంతో ఆ సమాచారాన్ని ఇక్కడి పోలీసులకు అందించారు. ఆర్జీఐఏ ఠాణా ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు బృందం దిల్లీకి చేరుకుని నిందితుడిని ట్రాన్సిట్‌ వారెంటు కింద శనివారం ఇక్కడికి తీసుకొచ్చింది. మరింత లోతుగా విచారించగా హైదరాబాద్‌లో మరో ఆరు చోరీలు చేసినట్లు.. మొత్తం రూ.2 కోట్లకుపైగా బంగారం, నగదు కాజేసినట్లు తేలింది. నిందితుడి నుంచి పోలీసులు కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని