Alfrazolam: కోళ్లఫారంలో అల్ఫ్రాజోలం తయారీ.. సంగారెడ్డి జిల్లాలో ఘటన

మారుమూల ప్రాంతంలో గుట్టుగా నడిపిస్తున్న నిషేధిత అల్ఫ్రాజోలం తయారీ కేంద్రంపై టీఎస్‌ న్యాబ్, సంగారెడ్డి, గుమ్మడిదల పోలీసులు దాడి చేసి రట్టు చేశారు.

Updated : 19 Jun 2024 08:37 IST

దాడి చేసి రూ.కోటి విలువైన డ్రగ్, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

మత్తుమందు తయారీ యంత్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ రూపేష్, సిబ్బంది

గుమ్మడిదల, న్యూస్‌టుడే: మారుమూల ప్రాంతంలో గుట్టుగా నడిపిస్తున్న నిషేధిత అల్ఫ్రాజోలం తయారీ కేంద్రంపై టీఎస్‌ న్యాబ్, సంగారెడ్డి, గుమ్మడిదల పోలీసులు దాడి చేసి రట్టు చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలోని ఈ తయారీ కేంద్రం, ముఠా వివరాలను జిల్లా ఎస్పీ రూపేష్‌ స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. కొత్తపల్లికి చెందిన ప్రభాకర్‌గౌడ్‌ గ్రామంలోని తన కోళ్లఫారంలో గోసుకొంద అంజిరెడ్డి(గుమ్మడిదల గ్రామం), సాయికుమార్‌గౌడ్‌(అనంతారం), క్యాసారం రాకేష్‌(వికారాబాద్‌ జిల్లా పంచలింగాల)లతో కలిసి ఆరు నెలలుగా మత్తు పదార్థమైన అల్ఫ్రాజోలం తయారు చేస్తున్నారు. ముడి సరకు ఎక్కడెక్కడ దొరుకుతుందో సాయికుమార్‌గౌడ్‌ తెలుపుతుండగా, అంజిరెడ్డి పెట్టుబడి పెట్టి తెప్పించేవారు. రాకేష్‌ కెమిస్టుగా వ్యవహరిస్తూ తయారు చేస్తుండగా, ప్రభాకర్‌గౌడ్‌ సరకును తీసుకెళ్లి కల్లు దుకాణాల్లో విక్రయించేవారు. దీనిపై సమాచారం అందుకున్న న్యాబ్‌ డీఎస్పీ శ్రీధర్, సీఐ సంతోష్‌ల బృందం సోమవారం అర్ధరాత్రి తయారీ కేంద్రంపై దాడి చేసి రూ.40 లక్షల విలువైన 2.60 కిలోల అల్ఫ్రాజోలంతోపాటు రూ.60 లక్షల విలువైన ముడి పదార్థాలను స్వాధీనం చేసుకుంది. నిందితులు అంజిరెడ్డి, రాకేష్‌లను వెంటనే అరెస్టు చేయగా, ప్రభాకర్‌గౌడ్‌ పరారీలో ఉన్నారు. ఇటీవల సాయికుమార్‌గౌడ్‌ ఓ కేసులో అరెస్టయి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నాడని ఎస్పీ వెల్లడించారు. సమావేశంలో పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, జిన్నారం సీఐ సుధీర్‌కుమార్, గుమ్మడిదల, జిన్నారం ఎస్సైలు మహేశ్వర్‌రెడ్డి, జయరావులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని