తెరాస కార్యకర్తను చంపిన మావోయిస్టులు

ములుగు జిల్లా వెంకటాపురం మండలం భోదాపురంలో తెరాస కార్యకర్తను మావోయిస్టులు కాల్చిచంపారు. అర్ధరాత్రి సమయంలో మావోయిస్టులు  ...

Updated : 11 Oct 2020 13:30 IST

వెంకటాపురం: ములుగు జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. వెంకటాపురం మండలం భోదాపురంలో తెరాస కార్యకర్తను కత్తులతో పొడిచి చంపారు. అర్ధరాత్రి సమయంలో మావోయిస్టులు ఇంట్లోకి చొరబడి మాడూరి భీమేశ్వర్‌(48)ను హత్య చేశారు. కుటుంబ సభ్యులు ఎంత బతిమాలినా పట్టించుకోకుండా కత్తులతో పొడిచి భీమేశ్వర్‌ను హతమార్చారు. అనంతరం ఘటనా స్థలంలో లేఖను వదిలి వెళ్లారు. అధికారపార్టీ అండతో పెత్తనం చేస్తున్నారని, ప్రశ్నించిన వారిని పోలీసులకు పట్టిస్తున్నారంటూ మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. వాజేడు పరిధిలో తెరాస, భాజపా నాయకులు తక్షణమే వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులపై దాడులను వెంటనే నిలిపివేయాలని లేఖలో కోరారు. ఈ ఘటన ములుగు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మావోయిస్టుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పార్టీ ఫండ్‌ ఇవ్వనందుకే హత్య చేశారు: ఎస్పీ
సామాన్య ప్రజలపై మావోయిస్టులు హత్యాకాండ కొనసాగిస్తున్నారని ములుగు ఎస్పీ సంగ్రాం సింగ్‌ పాటిల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు మావోయిస్టులు భీమేశ్వర్‌ను పార్టీ ఫండ్‌ అడిగారని, డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. ఆరుగురు మావోయిస్టులు భీమేశ్వర్‌ ఇంట్లోకి చొరబడి హత్యచేశారని వెల్లడించారు. డబ్బు ఇవ్వని సామాన్య ప్రజలను ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు హతమారుస్తున్నారని పేర్కొన్నారు. గిరిజనులను అభివృద్ధి కార్యక్రమాలకు దూరం చేస్తున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని