Drugs: కెమిస్ట్రీలో పీజీ చేసి డ్రగ్స్‌ తయారీ.. రూ.1400కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలు పట్టివేత

దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో సమీపంలో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు బయటపడటం కలకలం రేపుతోంది. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ పట్టభద్రుడైన ఓ వ్యక్తి ఔషధాల తయారీ ముసుగులో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ తయారుచేస్తున్నాడు.

Published : 04 Aug 2022 17:45 IST

ముంబయి సమీపంలో ఘటన

ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయి సమీపంలో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు బయటపడటం కలకలం రేపుతోంది. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ పట్టభద్రుడైన ఓ వ్యక్తి ఔషధాల తయారీ ముసుగులో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ తయారుచేస్తున్నాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో 700 కిలోలకు పైగా మెఫిడ్రోన్‌ డ్రగ్స్‌ను ముంబయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1400కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది.

పాల్ఘర్‌ జిల్లా నాలాసొపారా ప్రాంతంలో ఓ ఔషధ తయారీ యూనిట్‌లో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు ఉన్నట్లు ముంబయి క్రైం బ్రాంచ్‌ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందించింది. దీంతో యాంటీ నార్కోటిక్స్‌ విభాగం పోలీసులు గురువారం ఆ యూనిట్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా.. అక్కడ నిషేధిత మాదకద్రవ్యాలు తయారుచేస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 700కిలోలకు పైగా మెఫిడ్రోన్‌ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనలో నాలాసొపారా యూనిట్‌లో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు ఆర్గానిక్‌ కెమెస్ట్రీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశాడు. ఆ నైపుణ్యాలతో అతడు డ్రగ్స్‌ తయారుచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి సేకరించిన వివరాలతో ముంబయిలో మరో నలుగురిని అరెస్టు చేశారు. ఇటీవల కాలంలో మహారాష్ట్ర పోలీసులు ఛేదించిన అతిపెద్ద డ్రగ్స్‌ గుట్టు ఇదేనని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని