Published : 24 Jun 2021 01:01 IST

Vaccine: నకిలీ ఐఏఎస్‌ను పట్టిచ్చిన ఎంపీ!

టీకా సందేశం రాకపోవడంతో అనుమానం

కోల్‌కతా: తనొక ఐఏఎస్ అధికారినని, తాను నిర్వహిస్తోన్న టీకా కార్యక్రమానికి హాజరుకావాలని  నటి, టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తినే బురిడీ కొట్టించాడో ప్రబుద్ధుడు. టీకా తీసుకున్న తర్వాత ఆమె ఫోన్‌కు ఎలాంటి సందేశం రాకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చిక్కాడు. ఆ వ్యక్తిని దేవాంజన్ దేవ్‌గా పోలీసులు గుర్తించారు. పశ్చిమ్‌ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా సమీపంలో కాస్బా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

కోల్‌కతా కార్పొరేషన్ జాయింట్ కమిషనర్‌నని నమ్మించిన అతడు నటి, టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తిని కలిశాడు. కాస్బా ప్రాంతంలో టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, దానికి హాజరు కావాలని ఆమెను ఒప్పించాడు. అందుకు సరేనన్న ఆమె.. ఆ కార్యక్రమానికి హాజరై, ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించేందుకు టీకా కూడా వేయించుకుంది. మామూలుగా టీకా డోసు స్వీకరించగానే.. ఫోన్‌కు సందేశం వస్తుంది. కానీ మిమి చక్రవర్తి ఫోన్‌కు ఎలాంటి మెసేజ్‌ రాలేదు. టీకా ధ్రువపత్రం గురించి అడిగినా దేవాంజన్ నుంచి సరైన సమాధానం లేదు. దాంతో ఇందులో ఏదో తిరకాసు ఉందని గ్రహించిన ఆమె.. తన సిబ్బంది ద్వారా అక్కడ టీకా వేయించుకున్న ఇతరుల గురించి ఆరా తీయించింది. వారికి కూడా తన పరిస్థితే ఎదురయిందని తెలిసింది. వెంటనే పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేసింది. దేవాంజన్‌ను నకిలీ ఐఏఎస్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. 

ఈ ఘటనపై మిమి చక్రవర్తి స్పందించింది ‘అదొక మంచిపని కావడంతో ఆ ఆహ్వానాన్ని మన్నించి వెళ్లాను. స్థానికులు ముందుకు వచ్చి టీకాలు వేయించుకోవాలనే ఉద్దేశంతో నేను కూడా టీకా తీసుకున్నాను. కానీ ఆ తర్వాత ఫోన్‌కు సందేశం రాకపోవడం, టీకా ధ్రువపత్రాన్ని అతడు ఇంటివద్దకే తెచ్చిస్తానడంతో నాకు అనుమానం వచ్చింది. ఇందులో ఏదో తిరకాసు ఉందని భావించి, పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని వెల్లడించింది. అయితే 200 కరోనా వయల్స్‌ అతడికి ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇలా మోసపూరితంగా టీకా కార్యక్రమం నిర్వహించడం అతడికి కొత్తేం కాదు. కొద్ది రోజులక్రితం సోనార్‌పూర్‌లో ఆటో డ్రైవర్ల కోసం ఈ తరహాలోనే టీకా శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. వీటి నిర్వహణ వెనుక అతడి అసలు ఉద్దేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని