Anakapalle: ప్రేమోన్మాది ఘాతుకం

ఓ ప్రేమోన్మాది ఏడాదిగా బాలిక వెంట పడ్డాడు. ఆమె ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి, తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది.

Published : 07 Jul 2024 05:20 IST

అనకాపల్లి జిల్లాలో బాలిక దారుణ హత్య

రాంబిల్లి, అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ఓ ప్రేమోన్మాది ఏడాదిగా బాలిక వెంట పడ్డాడు. ఆమె ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి, తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతనిపై పోక్సో కేసుపెట్టి జైలుకు పంపారు. దీంతో బాలికపై కక్ష పెంచుకున్న నిందితుడు బెయిల్‌పై వచ్చి ఆమెను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో జరిగింది. కొప్పుగుండుపాలేనికి చెందిన బద్ది దర్శిని(14) రాంబిల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. రోజూలాగే శనివారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. కొద్దిసేపటికి ఆ ఇంట్లోంచి బోడాబత్తుల సురేష్‌(26) అనే యువకుడు బయటికి రావడాన్ని బాలిక నానమ్మ కాంతం చూశారు. అనుమానంతో వెంటనే లోపలికి వెళ్లిన ఆమె.. రక్తపు మడుగులో ఉన్న మనవరాలిని చూసి కేకలు వేశారు. చుట్టుపక్కలవారు వచ్చి బాలికను పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సురేష్‌ తన మనవరాలిని హత్య చేశాడని కాంతం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కశింకోటకు చెందిన సురేష్‌.. కొప్పుగుండుపాలెంలోని అమ్మమ్మ ఇంటివద్ద ఉంటున్నాడు. జులాయిగా తిరిగే అతను కొన్నాళ్లుగా బాలికను ప్రేమ పేరుతో వేధించేవాడని, ఏడాది కిందట రాంబిల్లి పోలీసులను ఆశ్రయించగా పోక్సో చట్టం కింద కేసు పెట్టి, జైలుకు పంపారని స్థానికులు తెలిపారు. ఇటీవల సురేష్‌ బెయిల్‌పై బయటికి వచ్చాడు. బాలిక పాఠశాల నుంచి వచ్చే సమయానికి ఆమె తల్లిదండ్రులు పనుల నుంచి ఇంటికి రారని గమనించే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బిడ్డ హత్యతో తల్లిదండ్రులు వెంకటరమణ, వరలక్ష్మి గుండెలవిసేలా రోదిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్‌ టీమ్‌లను రప్పించి నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు.

నిందితుణ్ని వెంటనే పట్టుకోండి: హోం మంత్రి

ఈ దారుణంపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణతో మాట్లాడారు. నిందితుణ్ని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. దీంతో పరవాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని