Updated : 16 Apr 2022 12:27 IST

Suicide: కామారెడ్డిలో విషాదం.. నిప్పంటించుకొని తల్లీకుమారుడు ఆత్మహత్య

కామారెడ్డి నేరవిభాగం: కామారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. ఓ లాడ్జిలోని గదిలో తల్లీకుమారుడు నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గది నుంచి తెల్లవారుజామున పొగలు రావడం లాడ్జి సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలిని డీఎస్పీ సోమనాథం, సీఐ నరేష్‌ పరిశీలించారు. మృతులను మెదక్‌ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన సంతోష్‌(40), అతని తల్లి పద్మ(65)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే సంతోష్‌ను భూముల అమ్మే విషయంలో తమకు రూ.50లక్షలు ఇవ్వాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు పోలీసు అధికారితో కలిసి డిమాండ్‌ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఫేస్‌బుక్‌లో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సదరు ప్రజాప్రతినిధులు సంతోష్‌పై కక్ష కట్టారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. తల్లి పద్మ వైద్యం కోసం ఈ నెల 11న కామారెడ్డికి చేరుకున్న సంతోష్‌ ఓ లాడ్జిలో దిగారు. వైద్య పరీక్షల అనంతరం వారు కామారెడ్డి మండల కేంద్రంలోని శ్రీకాళభైరవ స్వామి ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. తల్లీకుమారుడు ఆత్మహత్యకు ముందు వీడియో చిత్రీకరించారు.

‘‘బాసం శ్రీనుతో కలసి నేను వ్యాపారం చేశా. శ్రీను వద్ద డబ్బులు లేకపోతే జితేందర్‌ గౌడ్‌ ఇచ్చాడు. వ్యాపారంలో 50శాతం వాటా కావాలని జితేందర్‌ గౌడ్‌ కోరారు. ఇవ్వలేమని.. కుదరదని చెప్పాం. ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెడితే నన్ను పీఎస్‌కు పిలిచారు. నా ఫోన్‌ను అప్పటి సీఐ నాగార్జున గౌడ్‌ తీసుకున్నారు. నన్ను కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారు. మరుసటి రోజు మెదక్‌ ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశా. 10 రోజులయ్యాక ఫేస్‌బుక్‌ అంశంలో సంబంధం లేదన్నారు. నా ఫోన్‌లో సమాచారాన్ని జితేందర్‌ గౌడ్‌కు ఇచ్చారు. జితేందర్‌ గౌడ్‌ మనుషులు ఫోన్‌లోని సమాచారంతో ఇబ్బంది పెట్టారు. నన్ను బెదిరించే విషయాన్ని పీఎస్‌లో ఫిర్యాదు చేశాను. ఏడాది పాటు జితేందర్‌ మనుషులు ఇబ్బంది పెట్టారు. నా వ్యాపారం సాగనీయలేదు, అప్పులు చేశాను. నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు. నన్ను మానసికంగా కుంగిపోయేలా చేశారు. నమ్మిన స్నేహితుడే దగా చేయడం తట్టుకోలేకపోయా. వాళ్ల ఇబ్బందులు తట్టుకోలేక చనిపోతున్నాం’’ అని వీడియోలో సంతోష్‌ అన్నారు.

సంతోష్‌ను రామాయంపేటకు చెందిన ప్రజాప్రతినిధులు వేధిస్తున్నారంటూ గతంలో 20 పేజీలతో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందనా లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని