హిరేన్‌ హత్య: పోలీసు అధికారిపై వేటు!

ముకేశ్‌ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాల వ్యవహారంలో..వాహన యజమాని మన్‌సుఖ్‌ హిరేన్‌ మృతిపై దర్యాప్తు జరుపుతోన్న పోలీసు అధికారిపై వేటు వేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Published : 11 Mar 2021 01:35 IST

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వాహన యజమాని మన్‌సుఖ్‌ హిరేన్‌ మృతిపై దర్యాప్తు జరుపుతోన్న పోలీసు అధికారిపై వేటు వేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆయనను క్రైం బ్రాంచ్‌ నుంచి తొలగిస్తున్నట్లు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ప్రకటించారు. ఎటువంటి విమర్శలకు తావు లేకుండా ఈ కేసు దర్యాప్తు చేస్తామని మహారాష్ట్ర హోంమంత్రి తెలిపారు.

ముకేశ్‌ అంబానీ ఇంటికి సమీపంలో లభించిన వాహనానికి సంబంధించిన యజమాని మన్‌సుఖ్‌ హిరేన్‌ ఇటీవల అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేస్తోన్న మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్‌).. హిరేన్‌ది హత్యేనని ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. ఈ నేపథ్యంలో కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసు అధికారి సచిన్‌ వాజేపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. హిరేన్‌ హత్యలో సచిన్‌ పాత్ర ఉందని ఆరోపిస్తూ..ఆయనను వెంటనే అరెస్టు చేయాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ అసెంబ్లీలో డిమాండ్‌ చేశారు. ఈ హత్యలో సచిన్‌ హస్తం ఉందంటూ హిరేన్‌ భార్య చేసిన ఫిర్యాదులోనూ పేర్కొంది. ఇలా పోలీసు అధికారి పాత్రపై ఆరోపణలు పెరిగిన నేపథ్యంలో ఆయనను విధులనుంచి తొలగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దక్షిణ ముంబయిలోని అంబానీ ఇంటికి సమీపంలో ఫిబ్రవరి 25న జిలెటిన్ స్టిక్స్‌తో ఉన్న ఓ వాహనాన్ని పోలీసులు కనుగొన్న సంగతి తెలిసిందే. ఆ వాహనం తనదేపని, అది చోరీకి గురైందని మన్‌సుఖ్ హరేన్‌ పోలీసులకు తెలిపారు. దానిపై అంతకుముందే ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలో మరుసటి రోజు రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ఆయన.. థానేలోని సముద్రపు ఒడ్డున శవమై కనిపించారు. ఇది హత్య అని ప్రాథమికంగా తేలడంతో కేసుపై అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని