Crime news: కోర్కె తీర్చమంటే నో చెప్పిందని.. గర్ల్‌ఫ్రెండ్‌పై దారుణం

తన లైంగిక వాంఛ తీర్చేందుకు నో చెప్పిందని కోపోద్రిక్తుడైన ఓ యువకుడు ఆమెను చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన ముంబయిలోని బాంద్రా సబర్బన్‌లో జరిగింది.

Updated : 02 Jun 2023 17:03 IST

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి(Mumbai)లో దారుణ ఘటన వెలుగుచూసింది. తన లైంగిక వాంఛ తీర్చేందుకు నిరాకరించిన ప్రియురాలిపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆమె గొంతు నులమేయడంతో పాటు తలను బండరాయికి మోది చంపేందుకు ప్రయత్నించాడని పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాలపాలైన యువతి(28)ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కేసులో నిందితుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు తెలిపారు. బుధవారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

ఈ ఘటన బాంద్రా సబర్బన్‌లోని పర్యాటక ప్రాంతమైన బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌ వద్ద బుధవారం చోటుచేసుకుంది. నిందితుడు ముంబయి శివారులోని కల్యాణ్‌ ప్రాంతానికి చెందిన యువకుడు(28)గా పోలీసులు గుర్తించారు. బాధిత యువతి, యువకుడు ఇద్దరూ ఒకే కంపెనీలో సహోద్యోగులుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని వెల్లడించారు. బుధవారం ఇద్దరూ కలిసి లోకల్‌ ట్రైన్‌లో కల్యాణ్‌ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌కు వెళ్లారని.. అక్కడి నుంచి గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వంటి పర్యాటక ప్రదేశాల్లో తిరిగినట్టు గుర్తించారు. సాయంత్రం బాంద్రా బాండ్‌స్టాండ్‌(bandra bandstand) వద్దకు చేరుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతూ.. ఆమెను పెళ్లి చేసుకొనేందుకు తన మతాన్ని మార్చుకున్నట్టు వెల్లడించాడు.

ఆ తర్వాత తన లైంగిక వాంఛను తీర్చాలంటూ బహిరంగ ప్రదేశంలోనే డిమాండ్‌ చేయగా.. అందుకు గర్ల్‌ఫ్రెండ్‌ ససేమిరా అనడంతో అతడిలోని మృగం బయటకొచ్చింది. తీవ్ర కోపోద్రిక్తుడై ప్రియురాలి గొంతు నులిమి చంపేందుకు యత్నించాడు. అలాగే, ఆమె తలను బండరాయికేసీ కొట్టి.. కాల్వలో పడేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె సహాయం కోసం కేకలు వేసినట్టు పోలీసులు తెలిపారు. అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. నిందితుడుని అదుపులోకి తీసుకొని.. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన యువతిని ఆస్పత్రికి తరలించారు. యువతి వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. యువతి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని