Mumbai: ప్రియుడితో కుమ్మక్కై ..భర్తకు స్లో పాయిజన్‌

ముంబయిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భార్య హతమార్చింది. అతడు తినే ఆహారంలో స్లో పాయిజన్‌ ఇచ్చి పక్కా ప్రణాళిక ప్రకారం ఎవరికీ అనుమానం రాకుండా చంపేసింది.

Published : 04 Dec 2022 01:05 IST

ముంబయి: వ్యక్తిగత కారణాలతో భర్తతో విడిపోయింది. కానీ, పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టు కొని మళ్లీ వెనక్కి వచ్చినట్టు నటించింది. ఈసారి.. పక్కా ప్లాన్‌ ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ఈ షాకింగ్‌ ఘటన ముంబయిలో జరిగింది. 

వివరాల్లోకి వెళ్తే.. కమల్‌ కాంత్‌, కవిత దంపతులు ముంబయిలో నివాసం ఉండేవారు. విడిపోయి తిరిగి వచ్చిన తర్వాత కవిత కుటుంబసభ్యులతో ఎప్పటిలాగేనే ఉండేది. కానీ, తన ప్రియుడు హితేశ్‌ సాయంతో భర్తను హతమార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. వారికి పెట్టే ఆహారంలో స్లో పాయిజన్‌ కలపడం మొదలు పెట్టింది. దీంతో ఇటీవల కమల్‌కాంత్‌ తల్లి ఉదర సంబంధిత సమస్యతో ప్రాణాలు కోల్పోయారు. అయితే, దీనిని అందరూ సాధారణ మరణంగా భావించారు. ఆ తర్వాత నవంబరు 19న తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన కమల్‌కాంత్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి రక్తంలో అర్సెనిక్‌, థాలియం లోహ ధాతువులు ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు వైద్యపరీక్షల్లో తేలింది. మానవ రక్తంలోకి ఇలాంటి పదార్థాలు చేరడం అసాధారణమని వైద్యులు తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత ప్రమాదంగానే భావించినా, ఏదో కుట్రకోణం ఉందన్న అనుమానంతో పోలీసులు కేసును ముంబయి క్రైం బ్రాంచ్‌ పోలీసులకు అప్పగించారు

దర్యాప్తు చేపట్టిన పోలీసులు కమల్‌ కాంత్‌ మృతికి  అతడి భార్య కవిత, ఆమె ప్రియుడు హితేశ్‌లే కారణమని నిర్ధరించారు. అతడిని హతమార్చాలనే ఉద్దేశంతోనే పక్కా ప్లాన్‌ ప్రకారం.. ఎవరికీ అనుమానం రాకుండా స్లో పాయిజన్‌ను ఆహారంలో కలిపి ఇచ్చారని చెప్పారు. మరోవైపు  అతని తల్లి కూడా ఉదర సంబంధిత సమస్యలతోనే మృతి చెందడంతో ఆమె మరణం వెనకకూడా వీళ్ల హస్తం ఉందేమోనన్న అనుమానంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని