Cyber Crime: షాకింగ్‌! టికెట్ ట్వీట్ చేస్తే ఖాతా నుంచి అర లక్ష మాయం!

రైలు ప్రయాణ వివరాలు ట్విటర్‌లో షేర్‌ చేసిన ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి సైబర్‌ నేరగాళ్లు అర లక్ష నగదు కొట్టేశారు. వ్యక్తిగత వివరాలు షేర్ చేసేందుకు సామాజిక మాధ్యమాలు సురక్షితమైన వేదికలు కాదని ఈ ఘటన మరోమారు రుజువు చేస్తోంది. 

Published : 03 Jan 2023 01:19 IST

ముంబయి: సైబర్‌ మోసాల (Cyber Fraud) గురించి ప్రభుత్వాలు, బ్యాంకులు, పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా.. నేరగాళ్లు కొత్త పంథాలో వినియోగదారులను ఏమార్చి ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాలు (Social Media) సురక్షితం అని చెబుతున్నప్పటికీ.. వ్యక్తిగత సమాచారం షేర్ చేయడానికి అవి అనువైన వేదికలు కావని తాజా ఘటన స్పష్టం చేస్తోంది. ముంబైకి చెందిన ఓ మహిళ చేసిన చిన్న తప్పిదం వల్ల ₹ 64 వేలు నష్టపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ముంబైలోని విలే పార్లే ప్రాంతానికి చెందిన ఓ మహిళ జనవరి 14న ముంబై నుంచి భుజ్‌ వెళ్లేందుకు ఐఆర్‌సీటీసీ (IRCTC)లో టికెట్ బుక్‌ చేసింది. రైల్లో బెర్తులు నిండిపోవడంతో ఆమెకు ఆర్‌ఏసీ వచ్చింది. దీంతో తనకు బెర్త్‌ కేటాయించారా? లేదా? అని తెలుసుకునేందుకు టికెట్ నంబర్‌తోపాటు ఫోన్‌ నంబరు వివరాలు ఐఆర్‌సీటీసీ కస్టమర్‌కేర్‌ను ట్యాగ్ చేస్తూ ట్విటర్‌ (Twitter)లో షేర్‌ చేశారు. తర్వాత కొద్దిసేపటికి, ఐఆర్‌సీటీసీ కస్టమర్‌కేర్‌ నుంచి మాట్లాడుతున్నామని ఫోన్‌ వచ్చింది. తమ ట్వీట్‌ చూసి ఐఆర్‌సీటీసీ ప్రతినిధి ఫోన్‌ చేశాడని భావించిన ఆమె కొడుకు  అతడితో సంభాషణ కొనసాగించాడు.

ఆర్‌ఏసీ నుంచి బెర్త్‌ ఖరారు చేసుకునేందుకు ఫోన్‌కు పంపిన లింక్‌పై క్లిక్ చేసి రెండు రూపాయలు నగదు బదిలీ చేయాలని ఫోన్‌లో వ్యక్తి సూచించడంతో, ఆమె కొడుకు నగదు బదిలీ చేశాడు. తర్వాత, బెర్త్‌ ఖరారు అయినట్లు మెసేజ్‌ వస్తుందని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే ఆమె బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా నగదు బదిలీ అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. మొత్తంగా ₹ 64 వేల నగదును సైబర్‌ నేరగాళ్లు దొంగిలించారు. దీంతో మోసపోయామని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిషింగ్‌ లింక్‌ సాయంతో యూపీఐ సెక్యూరిటీ కోడ్ ద్వారా నిందితుడు ఆమె ఖాతా నుంచి నగదు ఖాళీ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ట్విటర్ పోస్ట్‌ ద్వారా ఫోన్‌ నంబరు, ప్రయాణ వివరాలు తెలుసుకుని ఉంటారని పోలీసులు తెలిపారు. అందుకే మెసేజ్‌ లేదా మెయిల్‌ ద్వారా వచ్చే లింక్‌లపై క్లిక్ చేయొద్దని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఐఆర్‌సీటీసీ మాత్రమే కాదు, సేవలను అందించే ఏ ఇతర సంస్థలు ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేయమని వినియోగదారులను కోరవని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని సైబర్‌ మోసాలపట్ల ప్రజలు మరింత అప్రమత్తతతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు