Ts News: ఆ కక్షతోనే ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం: జోయల్‌ డేవిస్

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన ప్రసాద్‌ను అరెస్టు చేసినట్లు పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ప్రసాద్ భార్య సర్పంచి పదవి పోవడం, పెండింగ్‌లో

Published : 08 Aug 2022 19:36 IST

హైదరాబాద్: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు ప్రసాద్‌ను అరెస్టు చేసినట్లు పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. ప్రసాద్ భార్య సర్పంచి పదవి పోవడం, పెండింగ్‌లో ఉన్న రూ.20లక్షలు మంజూరు కాకపోవడానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారణమని భావించిన ప్రసాద్‌ కక్ష పెంచుకొని హత్యకు కుట్ర పన్నాడని డీసీపీ వెల్లడించారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలు డీసీపీ మీడియాకు వివరించారు.

‘‘సర్పంచ్ లావణ్య అక్రమాలకు పాల్పడినట్లు మక్లూర్ ఎంపీవో ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో ఎంపీవోపై ప్రసాద్ దాడి చేయడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎమ్మెల్యేను హత్య చేయాలని కుట్ర పన్నిన ప్రసాద్ నాంపల్లిలో ఎయిర్ పిస్టల్, మహారాష్ట్రలోని నాందేడ్‌లో కత్తిని కొనుగోలు చేశాడు. తెలిసిన వ్యక్తుల ద్వారా గత నెల జులై 15న బిహార్‌కు చెందిన మున్నా వద్ద దేశవాళీ తుపాకీ కొనుగోలు చేసినప్పటికీ, అందులో బుల్లెట్లు లేకపోవడంతో వాటికోసం ప్రసాద్ ప్రయత్నించి విఫలమయ్యాడు. ఎయిల్ పిస్టల్‌తోనే ఎమ్మెల్యేని హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.

ఈ నెల 1న రాత్రి 8.30 గంటల సమయంలో బంజరాహిల్స్ వెళ్లిన ప్రసాద్ నేరుగా 3వ అంతస్తులోకి వెళ్లి జీవన్‌రెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించి ఒక్కసారిగా ఎమ్మెల్యే కేకలు వేయడంతో ప్రసాద్ అక్కడినుంచి పారిపోయాడు. బంజారాహిల్స్, టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలించి ప్రసాద్‌ను అరెస్టు చేశారు. ప్రసాద్‌కు సహకరించిన వారు పరారీలో ఉన్నారు. వాళ్ల కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నాం. ఈ హత్యాయత్నం కేసుకు సంబంధించి ఇతర రాజకీయ పార్టీల ప్రమేయం ఉందనే విషయంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ప్రసాద్‌ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది’’ అని జోయల్ డేవిస్ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని