Crime News: తల విరాట్‌నగర్‌లో..మొండెం తుర్కయాంజల్‌లో..

నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన జైహింద్‌ నాయక్‌ (30) అనే మతి స్థిమితం లేని వ్యక్తి దారుణహత్య కేసులో మొండెం లభ్యమైంది...

Updated : 13 Jan 2022 19:27 IST

హైదరాబాద్‌: నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన జైహింద్‌ నాయక్‌ (30) అనే మతి స్థిమితం లేని వ్యక్తి దారుణహత్య కేసులో మొండెం లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లోని ఓ భవనంపై జైహింద్‌ నాయక్‌ మొండెం గుర్తించారు. మూడు రోజుల క్రితం నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నాగార్జున సాగర్‌, హైదరాబాద్‌ జాతీయ రహదారి పక్కనే విరాట్‌నగర్‌ కాలనీలో మెట్టు మహంకాళీ అమ్మవారి విగ్రహం వద్ద .. దుండగులు మొండెం లేని తలను ఉంచారు. డీఎస్పీ ఆనంద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన తల ఫొటో ఆధారంగా మృతుడు జైహింద్‌ నాయక్‌ అని గుర్తించారు. అతడిది సూర్యాపేట జిల్లా పాకలవీడు మండలం శూన్యపహాడ్‌ గ్రామం అని నిర్ధారించారు. దారుణహత్యను గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చారా? మరేదైనా కారణముందా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. కేసు మిస్టరీని చేధించేందుకు 8 పోలీసు బృందాలను నియమించారు. 

హతుడికి మతిస్థిమితం లేకపోవడం, సెల్‌ఫోన్‌ ఉపయోగించకపోవడం, చివరిసారిగా అతడిని చూసినవారు లేకపోవడం తదితర కారణాల వల్ల ఈ హత్యకేసులో ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఆశించినంతగా పురోగతి లేదు. మరోవైపు తల దొరికిన విరాట్‌నగర్‌లోని మహంకాళీ అమ్మవారి దేవాలయాన్ని బుధవారం నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి పరిశీలించి విచారణ జరుగుతున్న తీరును సీసీఎస్‌ డీఎస్పీ మొగులయ్యని అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ - సాగర్‌ రహదారిపై రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌ నుంచి కొండమల్లేపల్లి వరకు సుమారు 80 కి.మీ. వరకు ప్రతి సెంటర్‌లోని సీసీ కెమెరాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. మరోవైపు తుర్కయాంజల్‌లో జైహింద్‌ నాయక్‌ గత కొన్నాళ్లుగా ఉంటున్న ప్రదేశంలోని ప్రతి ఒక్కరిని పోలీసులు ప్రశ్నించారు. ఈక్రమంలో ఓ భవనంపై జైహింద్‌ నాయక్‌ మొండెం లభ్యమైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని