Crime news: భారమనుకుని నేలకేసి బాది.. ఏడాదిన్నర పసివాడిని పొట్టన పెట్టుకున్న కర్కశుడు

పాపం పసివాడు... ఏడాదిన్నరకే నూరేళ్లూ నిండాయి. అగ్నిసాక్షిగా పెళ్లాడిన దంపతులు అనుమానంతో విడిపోయారు.

Updated : 07 Jul 2024 08:05 IST

కుమారుడి ప్రాణాలు పోగొట్టిన తల్లి సహజీవనం

చిత్తూరు గ్రామీణ, న్యూస్‌టుడే: పాపం పసివాడు... ఏడాదిన్నరకే నూరేళ్లూ నిండాయి. అగ్నిసాక్షిగా పెళ్లాడిన దంపతులు అనుమానంతో విడిపోయారు. సహజీవనం పేరుతో ఆ మహిళకు దగ్గరైన వ్యక్తి... ఆమెతో గడపడాన్నే సుఖజీవనమని భావించాడు. ఆమె ముగ్గురు పిల్లల పోషణను భారమనుకున్నాడు. ఓ చిన్నారిని నేలకేసి కొట్టి ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడు. ఈ అమానుష ఘటన చిత్తూరు గ్రామీణ మండలం దిగుమాసాపల్లెలో శనివారం చోటుచేసుకుంది. బీఎన్‌ఆర్‌పేట ఎస్సై వెంకట సుబ్బమ్మ కథనం ప్రకారం.. జిల్లాలోని తవణంపల్లె మండలం మాధవరం సమీప కృష్ణాపురానికి చెందిన శిరీషకు... ఐరాల మండలం జంగాలపల్లెకి చెందిన చంద్రప్రకాష్‌తో కొన్నేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. శిరీషకు మతిస్థిమితం లేకపోగా, నత్తి ఉంది. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానంతో చంద్రప్రకాష్‌ తరచూ ఆమెను వేధిస్తూ దూరం పెట్టారు. 

పరిచయం... వివాహేతర సంబంధం

భర్తకు దూరంగా పిల్లలతో ఉంటున్న శిరీషకు.. అదే గ్రామానికి చెందిన ప్రదీప్‌తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. 25 రోజుల క్రితం పనుల కోసం ముగ్గురు పిల్లలతో కలిసి దిగుమాసాపల్లెలోని ఓ కోళ్లఫారంలో చేరారు. పిల్లల పోషణ భారమనుకున్నాడు ప్రదీప్‌. శనివారం మద్యం తాగాడు. ఆ మత్తులో దినేష్‌ (ఏడాదిన్నర వయసు)ను నేలకేసి బాది చంపేశాడు. పిల్లాడు ఇంటిపై నుంచి పడి చనిపోయాడని, కొన ఊపిరితో ఉన్నాడని శిరీషతో చెప్పాడు. ఇద్దరూ కలిసి దినేష్‌ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. శిరీష తన కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. వారికి అనుమానం వచ్చి... వీడియో కాల్‌లో దినేష్‌ను చూపాలని పట్టుబట్టారు. బాలుడి ముక్కు, నోటి నుంచి రక్తం రావడం, ప్రదీప్‌ మాటతీరు, ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో శిరీష సోదరుడు భాను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రదీప్‌ను పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని