Munugode: మునుగోడు కాల్పుల కేసు.. వివాహేతర సంబంధమే కారణం: ఎస్పీ

తుపాకితో కాల్చి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా సుపారీతో పాటు తుపాకి కల్చర్‌ వెలుగులోకి రావడంతో అన్ని వర్గాల వారు ఉలిక్కిపడ్డారు. మునుగోడు మండలం సింగారం గ్రామ శివారులో నిమ్మలస్వామిపై ...

Updated : 13 Aug 2022 05:46 IST

నల్గొండ: తుపాకితో కాల్చి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా సుపారీతో పాటు తుపాకి కల్చర్‌ వెలుగులోకి రావడంతో అన్ని వర్గాల వారు ఉలిక్కిపడ్డారు. మునుగోడు మండలం సింగారం గ్రామ శివారులో నిమ్మలస్వామిపై ఈనెల 4న జరిగిన హత్యాయత్నం కేసులో 9మందిని అరెస్టు చేయగా, ఒకరు పరారీలో ఉన్నట్టు ఎస్పీ రెమారాజేశ్వరి తెలిపారు. నిందితుల నుంచి ఒక పిస్టల్‌, 9 చరవాణిలు, రూ.4,500 నగదు, ప్రామిసరీనోట్లు, రెండు బ్యాంకు చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు.  

మర్రిగూడ మండలం తుమ్మడపల్లి గ్రామానికి చెందిన చింతపల్లి బాలకృష్ణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉంటూ నార్కట్‌పల్లి మండలం బి.వెల్లంలా గ్రామంలోని జడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో మిడ్‌ డే మీల్స్‌ వర్కర్‌గా పనిచేస్తున్న ఓ మహిళతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరి సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఆమె భర్త నిమ్మలస్వామిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. దీనికోసం ముందుగా యాచారం మండలం మాల్‌ ప్రాంతానికి చెందన కనక రామస్వామితో రూ.3లక్షలకు సుపారీ కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ.1.70లక్షలు తీసుకున్న రామస్వామి మునుగోడులో నిమ్మల రామస్వామి దుకాణం పక్కనే మరో దుకాణం అద్దెకు తీసుకొని అందులో పనిచేస్తున్న మొహినుద్దీన్‌తో పరిచయం పెంచుకున్నాడు. దీంతో పాటు చింతపల్లి మండలం ఇంజమూరు గ్రామానికి చెందిన పోల్‌గిరి, రత్నాల వెంకటేశ్‌లతో కలిసి హత్య చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. బాలకృష్ణ అంతటితో ఆగకుండా మరోసారి హైదరాబాద్‌లో ప్లంబర్‌గా పనిచేస్తున్న యూసుఫ్‌తో కలిసి పథకం వేసి రూ.12లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈసారి రూ.5లక్షలు సుపారీ ఇచ్చాడు. యూసుఫ్‌ తన స్నేహితుడు జహంగీర్‌ పాష, ఆసిఫ్‌ ఖాన్‌లు కలిసి అప్పటికే బిహార్‌లో పిస్టల్‌ కొనుగోలు చేసుకుని ఉన్న అబ్దుల్‌ రహమాన్‌తో కలిసి ఈనెల 4న స్వామిపై 3 రౌండ్లు కాల్పులు జరిపారు. వీరిలో యూసుఫ్ పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని