NEET student suicide: ఒత్తిడి తాళలేక.. ఉరి వేసుకున్న నీట్‌ విద్యార్థి

ఒత్తిడి తట్టుకోలేక నీట్‌ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాలుగు రోజుల వ్యవధిలోనే మరో విద్యార్థి మరణించాడు.

Published : 12 May 2023 01:29 IST

జైపూర్‌: ఒత్తిడికి తట్టుకోలేక నీట్‌ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ (NEET) విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్‌ (Rajasthan)లోని కోటా (Kota) పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar pradesh)లోని బులంద్‌షహర్ (Bulandshahr) జిల్లా ఖుర్జా (Khurja)పట్టణానికి చెందిన 15 ఏళ్ల ధనుష్ కుమార్‌ శర్మ ప్రస్తుతం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. రాజస్థాన్‌లోని కోటా పట్టణంలో ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటూ నీట్‌ పరీక్ష కోసం నెల రోజులుగా స్థానిక కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. బుధవారం రాత్రి భోజనం చేసి తన గదికి వెళ్లిపోయాడు. అదే సమయంలో తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోను చేసినా అతడు స్పందించలేదు. మరుసటి రోజు ఉదయం మళ్లీ ఫోను చేసినా తీయలేదు. దాంతో కంగారుపడిన తల్లిదండ్రలు వారి ప్రాంతం నుంచి కోచింగ్‌ తీసుకుంటున్న మరో అబ్బాయికి ఫోను చేసి తమ కుమారుడి గదికి వెళ్లి చూడమని అడిగారు.

స్నేహితుడు, హాస్టల్‌ వార్డెన్‌ ఎంత పిలిచినా తలుపులు తెరవలేదు. దీంతో అంతాకలిసి తలుపును బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా ధనుష్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. మృతుడి గదిలో ఎలాంటి సూసైడ్‌ నోటు కనిపించలేదు. తల్లిదండ్రలు వచ్చిన వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తామని తెలిపారు. అక్కడే కోచింగ్‌ తీసుకుంటున్న బెంగళూరుకు చెందిన మహమ్మద్‌ నాసిద్‌(22)  అనే విద్యార్థి నాలుగు రోజుల క్రితం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కోటా పట్టణంలో ఉన్న వివిధ కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకుంటూ ఆత్మహత్య చేసుకుని ఏడుగురు మరణించారు. అంతేకాకుండా 15 మంది ఆత్మహత్యకు ప్రయత్నించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని