NIA Raids: మావోయిస్టు ఆర్కే భార్య, విరసం నేతల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. విరసం నాయకుడు కల్యాణరావు

Updated : 19 Jul 2022 14:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. విరసం నాయకుడు కల్యాణరావు , మావోయిస్టు ఆర్కే భార్య శిరీష ఇంట్లో తనిఖీలు జరిపారు. జిల్లా పోలీసుల బలగాల సహాయంతో వారి ఇళ్లను చుట్టుముట్టారు. స్థానికులను, మీడియా ప్రతినిధులను పరిసరాల్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉండవచ్చనే అనుమానాలతో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు విజయవాడ సింగ్‌నగర్‌లోని దొడ్డి ప్రభాకర్‌ ఇంట్లోనూ ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించింది.

నేనేం నేరం చేశాను?

ఎన్ఐఏ సోదాలపై ఆర్కే భార్య శిరీష స్పందించారు. సోదాల పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. భర్త చనిపోయి బాధపడుతుంటే విచారణ పేరుతో వేధిస్తారా అని ప్రశ్నించారు. ‘‘అనారోగ్య సమస్యలు నన్ను తీవ్రంగా వేధిస్తున్నాయి. అజ్ఞాతవ్యక్తులు మా ఇంటి వద్ద ఉన్నారంటూ సోదాలు చేస్తున్నారు. నేను ఏం నేరం చేశానని? నేరం చేసినవాళ్లు రోడ్లపై తిరుగుతుంటే మాత్రం పట్టించుకోరు. మహిళ అని కూడా చూడకుండా ఇబ్బందికి గురిచేస్తున్నారు’’ అని శిరీష ఆవేదన వ్యక్తం చేశారు.

విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ లూనా సెంటర్‌లోని ఓ గృహంలో కూడా ఎన్‌ఐఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన నలుగురు యువకులు అక్కడ ఏడాదిగా అద్దెకు ఉంటున్నారు. తెల్లవారుజామున ఒక్కసారిగా ఇంటిపై ఎన్‌ఐఏ అధికారుల బృందం దాడి చేసింది. ఈ ప్రాంతం నుంచి మావోయిస్టులకు నగదు బదిలీలు జరిగినట్లు ఎన్‌ఐఏ అధికారులు అనుమానిస్తున్నట్లు సమాచారం. మావోయిస్టు సానుభూతిపరులు ఉన్న ఇంటి వద్దకు స్థానిక పోలీసులను ఎన్‌ఐఏ అధికారులు అనుమతించలేదు. ఈ తనిఖీ వివరాలను ఎన్‌ఐఏ గోప్యంగా ఉంచుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని