Updated : 23 Jun 2022 12:29 IST

Telangana News: తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు

ఉప్పల్‌: తెలంగాణ హైకోర్టు న్యాయవాది శిల్ప ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఉప్పల్‌ చిలుకానగర్‌లోని ఆమె నివాసంలో ఎన్ఐఏ అధికారులు గురువారం ఉదయం సోదాలు చేశారు. విశాఖలో మూడేళ్లుగా కనిపించకుండా పోయిన రాధ అనే నర్సింగ్ విద్యార్థిని నక్సల్స్‌లో చేర్చారని శిల్పపై అభియోగాలు దాఖలయ్యాయి. విశాఖలో మిస్సింగ్‌ కేసుగా నమోదైన ఈ కేసు దర్యాప్తును తాజాగా ఎన్‌ఐఏకి అప్పగించారు. విశాఖ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఎన్‌ఐఏ అధికారులు శిల్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శిల్పను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు. రాధ మిస్సింగ్‌ కేసుకు సంబంధించి అధికారులు శిల్పను ప్రశ్నించనున్నారు.

మూడు సంవత్సరాల క్రితం తమ కూతురుని కిడ్నాప్ చేశారని 2017 డిసెంబరులో విశాఖలోని పెదబయలు పీఎస్‌లో రాధ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) నాయకులు రాధను కిడ్నాప్ చేసి బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని రాధ తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్ప, తదితరులు తమ నివాసానికి వచ్చేవారని ఫిర్యాదులో తెలిపారు. వైద్యం పేరుతో దేవేంద్ర రాధను తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మెదక్‌ జిల్లా చేగుంటలోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్‌ కుమారుడి ఇంట్లో తెల్లవారుజాము నుంచి సోదాలు చేస్తున్నారు. అలాగే మేడ్చల్‌ జిల్లాలోని మేడిపల్లి పర్వతాపూర్‌లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ప్రభాకర్‌ భార్య, న్యాయవాది దేవేంద్రను అదుపులోకి తీసుకున్నారు. దేవేంద్ర గతంలో చైతన్య మహిళా సంఘంలో పని చేశారు.

రాధ కేసుతో శిల్పకు సంబంధం లేదు..

న్యాయవాది శిల్పను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకోవడంపై ఆమె భర్త బండి కిరణ్‌ స్పందించారు. ‘‘సోదాల విషయంలో ఎన్‌ఐఏ మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. శిల్ప ప్రస్తుతం చైతన్య మహిళా సంఘంలో లేదు. ప్రస్తుతం ప్రజల సమస్యల గురించి పోరాడుతున్నాం. మావోయిస్టు అనుబంధ సంస్థగా ముద్ర వేస్తున్నారని శిల్ప చైతన్య మహిళా సంఘం నుంచి బయటకు వచ్చింది. శిల్పను ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి కేసులు పెడుతున్నారు. గతంలో అర్బన్‌ మావోయిస్టు అని శిల్పను 6 నెలలు జైల్లో ఉంచారు. రాధ మిస్సింగ్‌ కేసుతో శిల్పకు ఎలాంటి సంబంధం లేదు’’ అని పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts