
Aryan khan: ఆర్యన్‌కు బెయిల్ కోసం తప్పని నిరీక్షణ.. వాదనలు నేటికి వాయిదా
ముంబయి: మాదకద్రవ్యాల కేసులో బెయిల్ కోసం బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్యన్‌తో పాటు అర్బాజ్ మర్చెంట్, మూన్‌మూన్ ధమేచా దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై వరుసగా రెండో రోజూ సుదీర్ఘ వాదనలు కొనసాగినా ఎవరికీ బెయిల్ రాలేదు. ఈ కేసులో వాదనలను గురువారం వింటామని వెల్లడించిన బాంబే హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ కేసు విచారణను కొనసాగిస్తామని న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌డబ్ల్యూ సాంబ్రే వెల్లడించారు. మరోవైపు, ఎన్సీబీ తరఫున ఏఎస్సీ అనిల్ సింగ్ కోర్టుకు హాజరయ్యారు. నిందితుల తరఫున ముకుల్ రోహత్గీ, అమిత్ దేశాయ్, అలీ కాశీఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ వాదనలు ముగించగా.. ఇంకా ఎన్సీబీ తరఫు న్యాయవాది వాదనలు వినాల్సి ఉంది. అయితే, ఇందుకు మరింత సమయం పట్టడంతో విచారణను రేపు పూర్తి చేసేందుకు ప్రయత్నిద్దామన్న జడ్జి.. ఈ కేసు తదుపరి వాదనలను గురువారానికి వాయిదా వేశారు.
మూన్మూన్ని బలిపశువుని చేశారు..
ఆర్యన్‌ఖాన్ తరఫున రెండో రోజు కూడా మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న అర్బాజ్ మర్చెంట్ తరఫున అమిత్ దేశాయ్, మూన్‌మూన్ ధమేచా తరఫున అలీ కాశీఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ వాదించారు. ఈ కేసులో నిందితులను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ముంబయి క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు ఇచ్చిన అరెస్టు మెమోలో అరెస్టుకు సరైన ఆధారాలు చూపడంలో విఫలమయ్యారని ముకుల్ రోహత్గీ తెలిపారు. ఆర్యన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎన్సీబీ కుట్ర సిద్ధాంతానికి బలం చేకూర్చేలా వాట్సాప్ చాట్లు లేవని అర్బాజ్ తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ కోర్టుకు తెలిపారు. నిందితులు ముంబయిలోనే ఉన్నందున ఎన్సీబీ విచారణకు ఎప్పుడైనా అందుబాటులోనే ఉంటారని చెప్పారు. అందువల్ల బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ కేసులో మూన్‌మూన్ ధమేచాని బలిపశువుని చేశారని ఆమె తరఫు న్యాయవాది అలీ కాశీఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ అన్నారు. ఆమె గదిలోకి వెళ్లిన రెండు-మూడు నిమిషాల్లోనే అరెస్టు చేశారని తెలిపారు. ఆమెతో పాటు సౌమ్య సింగ్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదన్నారు.