ఆ బాలికల మృతదేహాలపై గాయాల్లేవు: డీజీపీ

యూపీలోని ఉన్నావ్‌ జిల్లాలో కలకలం రేపిన ఇద్దరు బాలికల అనుమానాస్పద మృతి ఘటనపై డీజీపీ హితేశ్‌ చంద్ర అవస్థీ స్పందించారు. ఆ ఇద్దరు బాలికల శరీరంపై ......

Published : 19 Feb 2021 01:13 IST

లఖ్‌నవూ: యూపీలోని ఉన్నావ్‌ జిల్లాలో కలకలం రేపిన ఇద్దరు బాలికల అనుమానాస్పద మృతి ఘటనపై డీజీపీ హితేశ్‌ చంద్ర అవస్థీ స్పందించారు. ఆ ఇద్దరు బాలికల శరీరంపై ఎలాంటి గాయాల గుర్తుల్లేవన్నారు. అలాగే వారి మరణానికి కారణాలు కూడా పోస్టుమార్టం నివేదికలో నిర్ధారణ కాలేదని చెప్పారు. మృతి చెందిన బాలికల అవయవాలను రసాయన పరీక్ష కోసం నిల్వ చేసినట్టు చెప్పారు. విషం వల్లే చనిపోయి ఉంటారని వైద్యులు అనుమానిస్తున్నట్టు పేర్కొన్నారు. కాన్పూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మరో బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు చెప్పారని డీజీపీ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఆరు పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేశామని, సీనియర్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

ఏం జరిగింది?

ఉన్నావ్‌ జిల్లాలోని బాబూహర గ్రామంలో దళిత వర్గానికి చెందిన ముగ్గురు బాలికలు పొలంలో అపస్మారక స్థితిలో పడి ఉండటం కలకలం రేపింది. దీంతో వారిని గ్రామస్థులు జిల్లా ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరు మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మరో బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కాన్పూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గ్రామానికి చెందిన  14-16 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలికలు పశువులకు గడ్డి తెచ్చేందుకు బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి పొలానికి వెళ్లి చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వారి కోసం గాలించారు. ఈ క్రమంలో పొలంలో అపస్మారక స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. బాలికల కాళ్లూ చేతులు దుపట్టాతో కట్టేసి ఉన్నాయని, నోటి నుంచి నురగలు కూడా వచ్చినట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఇద్దరు మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. బాలికలకు ఎవరో బలవంతంగా విషం ఇచ్చారని ఆరోపిస్తున్నారు. 

ఉన్నతస్థాయి దర్యాప్తుకు ప్రతిపక్షాల డిమాండ్‌

ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఈ ఘటనపై డీజీపీ నుంచి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాన్పూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు మంచి వైద్యం అందించాలని సీఎం ఆదేశించినట్టు అధికార ప్రతినిధి తెలిపారు. వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. పోలీసుల వైఖరి చూస్తుంటే కేసును తప్పుదోవ పట్టించే యత్నం కనబడుతోందని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్‌ సాజన్‌ ఆరోపించారు. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని