Nizamabad: ఇందల్వాయి టోల్‌ గేట్‌ వద్ద కాల్పుల కలకలం

కారు పైకి దూసుకురావడంతో.. ఆత్మరక్షణ కోసం ఎస్సై గాల్లో కాల్పులు జరిపిన ఘటన నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌లో చోటు చేసుకుంది.

Updated : 29 May 2023 14:35 IST

దర్పల్లి: నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి టోల్‌గేట్‌ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. తన వాహనంపై దొంగలు దూసుకురావడంతో.. ఆత్మరక్షణ కోసం ఎస్సై గాల్లో కాల్పులు జరిపారు. వివరాల్లోకి వెళితే.. ముప్కాల్ మండలంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాపర్‌ కాయిల్‌ చోరీ చేసిన అంతర్‌రాష్ట్ర ముఠా 44వ జాతీయ రహదారి మీదుగా వెళ్తోందని పోలీసులకు ఆదివారం అర్ధరాత్రి సమాచారం వచ్చింది. దీంతో ఇందల్వాయి ఎస్సై నరేశ్, దర్పల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి ఇందల్వాయి టోల్‌గేటు వద్ద వాహనాలను తనిఖీ చేశారు.

ఈ క్రమంలో దొంగల ముఠా అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో తమ కారుతో దర్పల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం ఎస్సైను సైతం ఢీకొట్టేందుకు రావడంతో ఆత్మరక్షణ కోసం ఆయన రెండు సార్లు గాల్లో కాల్పులు జరిపారు. దీంతో దుండగులు పక్కవైపు నుంచి పారిపోయినట్లు ఇందల్వాయి ఎస్సై నరేశ్‌ తెలిపారు. అంతర్‌రాష్ట్ర ముఠాపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని