Job fraud: భారీ జాబ్‌ స్కాం.. 50వేల మందిని మోసగించిన ముఠా గుట్టురట్టు!

దేశంలోనే అతి పెద్ద జాబ్‌ స్కామ్‌ని ఒడిశా పోలీసులు బట్టబయలు చేశారు. ఉద్యోగాల పేరిట పత్రికల్లో ప్రకటనలు.. నకిలీ వెబ్‌సైట్లు.. కాల్‌ సెంటర్ల నుంచి ఫోన్‌ కాల్స్‌ చేయించి అమాయక యువతకు మోసగించిన ముఠాలో కీలక సభ్యుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే..

Published : 02 Jan 2023 00:19 IST

భువనేశ్వర్‌: దేశంలోనే ఓ భారీ ఉద్యోగాల మోసాన్ని ఒడిశా పోలీసులు బట్టబయలు చేశారు. ఉద్యోగాల పేరుతో వేలాదిమంది యువతను మోసం చేసి రూ.కోట్లలో డబ్బు కాజేసిన ముఠాలో కీలక సభ్యుడిని ఒడిశా ఎకనామిక్‌ అఫెన్స్‌ వింగ్‌ (ఈవోడబ్ల్యూ) అధికారులు అరెస్టు చేశారు. ఉద్యోగాల పేరిట జరిగిన ఈ భారీ మోసం వెనుక మాస్టర్‌ మైండ్‌ యూపీలోని అలీగఢ్‌ ప్రాంతానికి చెందిన జాఫర్‌ అహ్మద్‌గా గుర్తించి అరెస్టు చేసినట్టు డీఐజీ జేఎన్‌ పంకజ్‌ వెల్లడించారు. అలీగఢ్‌ కేంద్రంగా కొనసాగిన ఈ మోసాన్ని గుర్తించి నిందితుడిని అక్కడే అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా.. ఐదు రోజుల పాటు రిమాండ్‌ విధించినట్టు తెలిపారు. అనంతరం నిందితుడిని ఒడిశాకు తీసుకొచ్చామన్నారు. జాఫర్‌ అహ్మద్‌ బీటెక్‌ పూర్తి చేశాడని.. అత్యంత చాకచక్యంగా మోసాలకు పాల్పడుతున్న ఈ నిందితుడిని అరెస్టు చేయడంలో సహకరించిన అలీగఢ్‌ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. జాఫర్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలోని ఈ ముఠాకు నిరుద్యోగ యువతే టార్గెట్‌. ఒడిశాతోపాటు పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఈ నెట్‌వర్క్‌ విస్తరించిందని వివరించారు.

ఫేక్‌ వెబ్‌సైట్లు.. 50మంది కాల్‌ సెంటర్‌ ఉద్యోగులు

ఈ మోసంలో జోక్యం ఉన్న మరికొందరి ఆచూకీ కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు డీసీపీ తెలిపారు. ఈ ముఠా చేతిలో 50వేల మంది మోసపోయి ఉంటారని.. వారి నుంచి రూ.కోట్లలో వసూలు చేసినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామన్నారు. యూపీలోని ప్రొఫెషనల్‌ ఇంజినీర్లు, వెబ్‌డెవలపర్ల సాయంతో నకిలీ వెబ్‌సైట్లు తయారు చేయడం ద్వారా  జాఫర్‌ ముఠా ఈ మోసాలకు పాల్పడేదని తెలిపారు. ఇందు కోసం 50 మంది కాల్ సెంటర్‌ ఉద్యోగుల్ని నియమించుకున్నారు. జమాల్‌పూర్‌, అలీగఢ్‌ కేంద్రాలుగా కార్యకలాపాలను కొనసాగించారు. ఈ కాల్‌ సెంటర్‌ ఉద్యోగులకు నెలకు రూ.15వేలు చొప్పున చెల్లించేవారని తెలిపారు. ఈ మోసానికి వెయ్యికి పైగా నకిలీ సిమ్‌ కార్డులు, 530 హ్యాండ్‌సెట్‌లు, మొబైల్‌ఫోన్లతో పాటు 100కు పైగా బినామీ పేర్లతో బ్యాంకు ఖాతాలు వాడినట్టు వెలుగులోకి వచ్చిందని పోలీసులు వివరించారు. 

ఒక్కొక్కరి నుంచి ₹3వేలు నుంచి ₹50వేలు దాకా..

నిందితులు నకిలీ సిమ్‌ కార్డులతో వాట్సాప్‌ వాయిస్‌ కాల్స్‌ చేస్తూ తమను గుర్తించకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు ఇచ్చి ఎక్కువ మంది యువతను మోసం చేసేందుకు వీలుగా ప్రభుత్వ వెబ్‌సైట్లను పోలి ఉండేలా నకిలీ వెబ్‌సైట్‌ను కూడా డెవలప్‌ చేశారు. ముఖ్యంగా ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి శాఖల్లో ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధానమంత్రి పథకాలను కూడా తమ మోసానికి ఉపయోగించుకున్ననట్టు పోలీసులు తెలిపారు. ఇలా.. రిజిస్ట్రేషన్‌, ట్రైనింగ్‌; కాల్‌ లెటర్‌ ఫీజుల పేరిట ఒక్కొక్కరిని నుంచి కనీసం రూ.3వేల నుంచి 50వేల వరకు వసూలు చేసి తర్వాత ఫోన్‌ చేసినా స్పందించేవారు కాదని తెలిపారు. తమ గుట్టుబయటపడకుండా ఉద్యోగం ఇచ్చే ప్రభుత్వం పథకం పేరుతో కాంటాక్ట్‌ సేవ్‌ చేసేవారు. ఎవరైనా ట్రూకాలర్‌లో చూసినా ఆ పథకం పేరు మాత్రమే కనిపించేది. నగదు వసూలులో కూడా ఇతరుల పేర్లుతో ఉన్న 100 బ్యాంకు ఖాతాలను ఉపయోగించేవారు. నిరుద్యోగులు ఆయా ఖాతాల్లో జమచేసిన డబ్బును జనసేవా కేంద్రాల ద్వారా మాత్రమే విత్‌డ్రా చేస్తూ ఇలా వేలాది మంది యువతను నిలువునా ముంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని