Secunderabad: సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటన.. వ్యక్తి అస్థిపంజరం గుర్తింపు

సికింద్రాబాద్‌లోని నల్లగుట్టలో అగ్నిప్రమాదం జరిగిన భవనంలోని మొదటి అంతస్తులో ఒక అస్థిపంజరాన్ని అధికారులు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన రోజు భవనంలో చిక్కుకుపోయిన ముగ్గురిలో ఆ అస్థిపంజరం ఎవరిదనే విషయం తెలియాల్సి ఉంది.

Updated : 21 Jan 2023 15:01 IST

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌లోని నల్లగుట్టలో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి ఒక మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజు ముగ్గురు సిబ్బంది కనిపించకుండా పోయారు. దుకాణంలో ఉన్న తమ వస్తువులు తెచ్చుకునేందుకు ముగ్గురు వెళ్లారని సహచరులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా భవనం మొదటి అంతస్తు వెనుకభాగంలో శిథిలాలు తొలగిస్తున్న క్రమంలో ఒక వ్యక్తి అస్థిపంజరాన్ని గుర్తించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన రోజు గుజరాత్‌కు చెందిన వసీం, జునైద్‌, జాహిద్ భవనంలో చిక్కుకుపోయినట్లు సమాచారం. అయితే, లభించిన అస్థిపంజరం ఎవరిదనే విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. 

అంతకుముందు ప్రమాదం జరిగిన దక్కన్‌ మాల్‌ సమీపంలోని నల్లగుట్ట ప్రాంతంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదంతో కంటి మీద కునుకు లేకుండా పోయిందని బస్తీవాసులు మంత్రి వద్ద వాపోయారు. అగ్ని ప్రమాదానికి గురైన భవనం ఒక్కసారిగా కూలిపోతే తీవ్రంగా నష్టపోతామని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని భవనాన్ని కూల్చేస్తామని స్థానికులకు తలసాని స్పష్టం చేశారు.

స్థానికులు ఎవరైనా నష్టపోతే వారికి పరిహారం

అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అగ్ని ప్రమాద ఘటన ఎంతో బాధాకరం. భవనంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు, సిబ్బంది వారి ప్రాణాలు సైతం లెక్కచేయలేదు. ప్రమాదం జరిగిన తర్వాత పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి మెరుగయ్యే వరకు అన్ని విభాగాల అధికారులు, మెడికల్‌ సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఈ ప్రమాదం వల్ల స్థానికులు ఎవరైనా నష్టపోతే వారికి పరిహారం అందిస్తాం. జంట నగరాల పరిధిలో 15.. 20.. 30 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు ఉన్నాయి. నివాసాల మధ్య ఇలాంటి సముదాయాలు ఉండటం... అనుకోని ప్రమాదాలు జరగడం వల్ల చుట్టుపక్కల వారు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈ నెల 25న ఉన్నత స్థాయి కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఒక వరుస క్రమంలో వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం.

పరిస్థితులను పరిశీలించి మాట్లాడితే బాగుంటుంది..

ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయ నాయకులు కొంత జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. ఏది పడితే అది మాట్లాడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. నిన్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వచ్చారు. పరిస్థితులను పరిశీలించి మాట్లాడితే బాగుంటుంది కానీ, లేనిపోని కామెంట్లు చేస్తే బాధ కలుగుతుంది. ఎప్పుడో 2008లో రద్దైన చట్టం గురించి వచ్చి మాట్లాడారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి అధికారులతో పాటు మీడియా ప్రతినిధులు కూడా పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అధికారులు ఏం చేస్తున్నారనేది మీడియాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇవేమీ తెలియకుండా వచ్చి ఏదో మాట్లాడి వెళ్లిపోవడం సరైంది కాదు. విమర్శలు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, ఆ విమర్శ బాధ్యతాయుతంగా ఉండాలి. ఈ ఘటనపై విచారణ జరుగుతుంది.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’’ అని తలసాని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని