Hyderabad: ఎడ్విన్‌ను కస్టడీకి ఇవ్వండి.. నాంపల్లి కోర్టులో ఓయూ పోలీసుల పిటిషన్‌

గోవా మాదకద్రవ్యాల సరఫరా కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎడ్విన్‌ను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఓయూ పీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాదకద్రవ్యాల కేసులో కీలక విషయాలు తెలుసుకోవడానికి ఎడ్విన్‌ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.

Published : 07 Nov 2022 22:30 IST

హైదరాబాద్: గోవా మాదకద్రవ్యాల సరఫరా కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎడ్విన్‌ను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఓయూ పీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాదకద్రవ్యాల కేసులో కీలక విషయాలు తెలుసుకోవడానికి ఎడ్విన్‌ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై 8వ తేదీన వాదనలు జరిగే అవకాశం ఉంది. గోవా కేంద్రంగా దేశంలోని పలు ప్రాంతాలకు ఎడ్విన్ మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొంతమందిని ముఠాగా ఏర్పాటు చేసుకొని వాళ్ల సాయంతో డార్క్ వెబ్, క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరిపి రూ. కోట్ల విలువైన మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

ఎడ్విన్‌ను ఈ నెల 5వ తేదీన అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఎడ్విన్ నకిలీ కరోనా సర్టిఫికెట్ సైతం గోవా పోలీసులకు సమర్పించాడు. దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి ఎన్నో అడ్డదారులు తొక్కాడు. హైదరాబాద్ పోలీసులకు చిక్కకుండా రెండు నెలల నుంచి తప్పించుకు తిరిగాడు. ఓ హోటల్‌లో పదేళ్ల క్రితం సర్వర్‌గా చేరిన ఎడ్విన్.. మాదకద్రవ్యాలు సరఫరా చేస్తూ క్రమంగా రూ.కోట్లకు పడగలెత్తినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా ఎడ్విన్‌కు ఉన్న నెట్ వర్క్ గురించి తెలుసుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని