Pak Boat: పాక్‌ పడవలో ₹400కోట్ల విలువైన డ్రగ్స్‌.. పట్టుకున్న భారత్‌!

భారీగా మాదకద్రవ్యాలతో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్‌ ఫిషింగ్‌ బోటును గుజరాత్ తీరంలో అధికారులు పట్టుకున్నారు. ఆ పడవలో ఆరుగురు సిబ్బందిని అదుపులోకి

Updated : 20 Dec 2021 19:03 IST

దిల్లీ: భారీగా మాదకద్రవ్యాలతో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్‌ ఫిషింగ్‌ బోటును గుజరాత్ తీరంలో అధికారులు పట్టుకున్నారు. ఆ పడవలో ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు ₹400 కోట్లు విలువ చేసే 77 కిలోల హెరాయిన్‌ని సీజ్‌ చేశారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ (ఐసీజీ), గుజరాత్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) సిబ్బంది సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి ఈ నార్కొటిక్ అక్రమ రవాణా గుట్టును బట్టబయలు చేశారు. గుజరాత్‌లోని కచ్ జిల్లా జాఖౌ తీరానికి 35 నాటికల్ మైళ్ల దూరంలో పడవను గుర్తించి డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పాకిస్థానీ ఫిషింగ్‌ బోటు ‘అల్‌ హుస్సేని’లో ఆరుగురు సిబ్బందితో పట్టుబడిందని, అలాగే, అందులో ₹400 కోట్ల విలువైన హెరాయిన్‌ని సీజ్‌ చేసినట్టు గుజరాత్‌ డిఫెన్స్‌ పీఆర్వో ట్విటర్‌లో వెల్లడించారు. తదుపరి దర్యాప్తు కోసం ఆ పడవను జాఖౌ తీరానికి తీసుకొచ్చినట్టు అధికారులు చెప్పారు. 

మరోవైపు, ఈ పడవ కరాచీ పోర్టు నుంచి వచ్చినట్టు ఏటీఎస్‌ అధికారులు తెలిపారు. డ్రగ్స్‌ డెలివరీ కోసం అధిక ఫ్రీక్వెన్సీ (VFH) రేడియో ఛానల్‌ హరి 1, హరి 2 అనే కోడ్‌ పదాలు ఉపయోగించి కాంటాక్ట్‌ అయ్యేందుకు ప్రయత్నించినట్టు గుర్తించామన్నారు. ఏటీఎస్‌ ప్రాథమిక విచారణలో వెల్లడైన సమాచారం ప్రకారం.. పాకిస్థాన్‌కు చెందిన హజీ హసన్‌, హజీ హసమ్‌ అనే ఇద్దరు స్మగ్లర్లు పంజాబ్‌లో అండర్‌ వరల్డ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు దీన్ని సరఫరా చేస్తున్నట్టుగా తెలిసిందని వెల్లడించారు. బోటులో సిబ్బంది పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ పడవను నిశితంగా తనిఖీ చేసి ఐదు బ్యాగ్‌లతో ఉన్న హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సీజ్‌ చేసిన నార్కొటిక్స్‌ విలువ ₹400 కోట్లు ఉంటుందని వెల్లడించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని