పరువు హత్య.. ఇష్టంలేని వృత్తి ఎంచుకుందని సోదరుడే కాల్చి చంపేశాడు!

21ఏళ్ల యువతి తన కెరీర్‌గా డ్యాన్స్‌, మోడలింగ్‌ ఎంచుకుందని తోడ పుట్టినవాడే కాల్చి చంపేశాడు. లాహోర్‌కు 130 కి.మీల దూరంలోని రెనాలా.....

Published : 07 May 2022 01:46 IST

లాహోర్‌‌: పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 21 ఏళ్ల యువతి తన కెరీర్‌గా డ్యాన్స్‌, మోడలింగ్‌ ఎంచుకుందని తోడ పుట్టినవాడే కాల్చి చంపేశాడు. లాహోర్‌కు 130 కి.మీల దూరంలోని రెనాలా ఖుర్ద్‌ ఒకారా అనే ప్రాంతంలో జరిగిన ఈ పరువు హత్యకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్రా అనే యువతి తన కుటుంబ ఇష్టానికి వ్యతిరేకంగా ఓ స్థానిక క్లాతింగ్‌ బ్రాండ్‌కు మోడలింగ్‌గా, ఫైసలాబాద్‌ నగరంలోని థియేటర్స్‌లో డ్యాన్సర్‌గా తన కెరీర్‌ కొనసాగిస్తోంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆ వృత్తి తమ కుటుంబ సంప్రదాయానికి విరుద్ధమని, వదిలేయాలంటూ ఎంతగానో ఒత్తిడి చేశారు. అయితే, ఇష్టంగా ఎంచుకున్న వృత్తిని వదులుకొనేందుకు సిద్రా ససేమిరా అంది. ఈ క్రమంలో ఇటీవల ఈద్‌ వేడుకలు తమ కుటుంబ సభ్యులతో జరుపుకొనేందుకు ఫైసలాబాద్‌ నగరం నుంచి స్వగ్రామానికి వచ్చింది.

అయితే, యువతి ఎంచుకున్న వృత్తిలో మర్యాదకు సంబంధించిన విషయంలో తల్లిదండ్రులు, సోదరుడు హమ్జా ఆమెతో గురువారం ఘర్షణ పడ్డారు. తన కెరీర్‌ను వదులుకోనని తేల్చి చెప్పడంతో ఆమెను కొట్టారని పోలీసులు తెలిపారు. ఆ మరుసటి రోజు హమ్జా కోపంతో తన సోదరిపై కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని వెల్లడించారు. యువతి సోదరుడిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడు నేరం అంగీకరించడంతో అరెస్టు చేసిననట్టు చెప్పారు. ఈ ఘటనపై ఫ్రాజ్‌ హమీద్‌ అనే అధికారి మాట్లాడుతూ.. ఎవరో బంధువులు తన సోదరి డ్యాన్స్‌ వీడియోను పంపడంతో అది చూసి ఆగ్రహం వ్యక్తంచేసినట్టు పేర్కొన్నారు. ఆ కోపంతోనే తన సోదరిని కాల్చి చంపేసినట్టు హమ్జా కూడా చెప్పాడన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని