
Crime News: ఆదిలాబాద్‌లో దారుణం.. కూతురు గొంతు కోసి చంపిన తల్లిదండ్రులు
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని నార్నూర్ మండలం నాగల్కొండలో తల్లిదండ్రులు.. కుమార్తె రాజేశ్వరి (20) గొంతు కోసి చంపేశారు. సీఐ ప్రేమ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని షేక్ అలీమ్, రాజేశ్వరి గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. 45 రోజుల క్రితం వారిద్దరు కలిసి మహారాష్ట్రకు పారిపోయారు. తమ కూతురు కనిపించడం లేదంటూ యువతి తల్లిదండ్రులు సావిత్రి బాయి, దేవీలాల్ స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. యువతి ఆచూకీ కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు. యువకుడిని రిమాండుకు తరలించారు. ఈ విషయంలో తల్లిదండ్రులతో రాజేశ్వరికి తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పరువు పోతుందనే భయంతో శుక్రవారం ఉదయం తల్లిదండ్రులే రాజేశ్వరిని కత్తితో గొంతు కోసి హతమార్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. రాజేశ్వరి తల్లిదండ్రులను అరెస్టు చేశారు.
Advertisement