Crime News: హైదరాబాద్‌ మోష్‌ పబ్‌లో మోసం చేసి.. నాగ్‌పూర్‌లో చిక్కిన నయా ముఠా

డేటింగ్‌ యాప్‌లతో అమ్మాయిలను ఎరగా వేసి కస్టమర్ల నుంచి అధిక బిల్లులు వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 12 Jun 2024 16:05 IST

హైదరాబాద్‌: డేటింగ్‌ యాప్‌లతో అమ్మాయిలను ఎరగా వేసి కస్టమర్ల నుంచి అధిక బిల్లులు వసూలు చేసిన ముఠాను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు  వివరాలను మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ మీడియాకు వెల్లడించారు. మోష్‌ పబ్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ మోసాన్ని ఛేదించినట్లు చెప్పారు. హైదరాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌కు పరారైన ఈ ముఠాను స్పెషల్‌ టీమ్‌ ఏర్పాటు చేసి అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

‘‘దిల్లీ నుంచి వచ్చిన ఆరుగురు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడ్డారు. నిరుద్యోగ యువతులను గ్రూప్‌లో చేర్చుకొని వారి పేర్లు మార్చి డేటింగ్‌ యాప్స్‌/సైట్స్‌లో ఫొటోలు పెట్టి చాట్‌ చేయిస్తారు. అబ్బాయిలను ట్రాప్‌ చేసి దగ్గర్లోని పబ్‌కి తీసుకెళ్తారు. వీరికి ఆయా పబ్‌లలో ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌ మెషిన్‌, సర్వ్‌ చేసే వాళ్లు ఉంటారు. డెవిల్స్‌ నైట్‌ పేరుతో సపరేట్‌ మెనూను యువతితో పాటు వచ్చిన కస్టమర్‌కి ఇస్తారు. బిల్లింగ్‌ సమయానికి యువతి అక్కడి నుంచి ఉడాయిస్తుంది. ఆ తర్వాత అధిక బిల్లు వేసి కస్టమర్ నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఆ మొత్తాన్ని ఈ గ్రూప్‌, యువతి, పబ్‌ నిర్వాహకులు పంచుకుంటారు. నెల రోజుల తర్వాత మరో ప్రాంతానికి వెళ్లిపోతారు. ఇలా.. 40 రోజుల్లో రూ.40లక్షల వరకు మోసం చేశారు. హైదరాబాద్‌ నుంచి పారిపోయి నాగ్‌పూర్‌లో ఇదే విధంగా మోసం చేయబోతుంటే పట్టుకున్నాం. ఈ ఆపరేషన్‌లో ముఠాలోని కీలక వ్యక్తులు తరుణ్‌, జగదీశ్‌, సాయి కుమార్‌ సహా ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేశాం. 8 సెల్‌ఫోన్లు, కారును సీజ్‌ చేశాం’’అని డీసీపీ వినీత్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని