
Mahesh Bank : మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాక్.. ముగ్గురి ఖాతాల్లోకి రూ.12.4 కోట్లు !
హైదరాబాద్ : మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాక్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన 3 ఖాతాలను గుర్తించారు. ముగ్గురిలో ఇద్దరిని ఇప్పటికే ప్రశ్నించిన అధికారులు.. వారిద్దరికీ హ్యాక్తో సంబంధం లేదని తేల్చి చెప్పారు. వినోద్, నవీన్ అనే ఇద్దరు వ్యక్తుల ఖాతాల్లో సైబర్ నేరగాళ్లు నగదు జమచేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరి ఖాతాల్లో రూ.5 కోట్లకు పైగా డిపాజిట్ చేసినట్లు గుర్తించామన్నారు. అయితే ఆ ఇద్దరి ఖాతాల నుంచి నగదును సైబర్ నేరగాళ్లు ఇతర ఖాతాల్లోకి మార్చారన్నారు.
మరో వ్యక్తి షానవాజ్ ఖాతాలో రూ.6.9కోట్లు జమచేసిన సైబర్ నేరగాళ్లు.. అక్కడి నుంచి ఇతరుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేశారన్నారు. ఫోన్ స్విఛావ్ కావడంతో షానవాజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడి చరవాణిని సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషిస్తున్నారు. షానవాజ్ కొన్ని నెలల క్రితం ముంబయిలో ఉన్నట్లు గుర్తించారు. సైబర్ నేరగాళ్లకు షానవాజ్ సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 3 ఖాతాల నుంచి రూ.12.4 కోట్ల మొత్తాన్ని నేరగాళ్లు ఇప్పటికే 128 ఖాతాలకు బదిలీ చేశారు. మరో 200 ఖాతాలకు బదిలీ కావొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల పరిశీలనకు రెండ్రోజుల్లో తెలంగాణ పోలీసులు కోల్కతా వెళ్లనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని బ్యాంకు ఖాతాలను సైతం పరిశీలించనున్నారు.