Hyderabad: తల నరికి.. మొండేన్ని ముక్కలు చేసిన కేసులో దర్యాప్తు సాగిందిలా..

అప్పు తీర్చాలని అడిగినందుకు తల నరికి.. మొండేన్ని ముక్కలు చేసి మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Updated : 25 May 2023 12:19 IST

సైదాబాద్‌: అప్పు తీర్చాలని అడిగినందుకు నర్సు తల నరికి.. మొండేన్ని ముక్కలు చేసి దారుణంగా హతమార్చిన ఘటన నగరంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాను సహజీవనం చేస్తున్న మహిళ వద్ద అతడు అప్పు తీసుకొని.. ఆ సొమ్ము తిరిగి ఇమ్మని అడిగినందుకు ఆమెను నిందితుడు చంద్రమోహన్‌ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. దాదాపు వారం రోజులు దర్యాప్తు చేసి ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. తాజాగా ఈ కేసును ఛేదించే క్రమంలో దర్యాప్తు సాగిన తీరును పోలీసు వర్గాలు వెల్లడించాయి.

‘‘అనురాధ హత్యకేసు ఛేదించేందుకు పోలీసులు ఎంతో శ్రమించారు. మృతురాలి తల పడేసిన స్థలం పరిసరాల్లో ఉన్న వందల సీసీ కెమెరాలను మలక్‌పేట పోలీసులు పరిశీలించారు. ముఖానికి మాస్క్ పెట్టుకుని ఓ ఆటోలో వెళ్తున్న వ్యక్తిపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ దిశగా దర్యాప్తును చేశారు. నిందితుడి ఆనవాళ్లు కూడా లేకపోవడంతో పోలీసులు 8 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేశారు. ఈ నెల 15, 16వ తేదీల్లో దాదాపు 100 అనుమానాస్పద వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని.. ఎట్టకేలకు నిందితుడు ఉపయోగించిన ఆటోను గుర్తించారు. ఆటో డ్రైవర్ చెప్పిన చిరునామా ఆధారంగా నిందితుడి ఇంటిని గుర్తించారు. హత్య చేసిన తర్వాత మృతురాలి తల పడేయడానికి బయటకొచ్చిన సమయంలో నిందితుడు చంద్రమోహన్ మాస్క్ పెట్టుకున్నట్టు పోలీసులు తేల్చారు. ఘటనా స్థలానికి వెళ్లి చూడటంతో హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చింది’’ అని పోలీసు వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని