కారు ప్రమాదం.. కళ్లముందే నిండు గర్భిణీ, భర్త సజీవదహనం

పురుటి నొప్పులతో బాధపడుతోన్న ఓ గర్భిణి ఆస్పత్రికి చేరే సమయంలో అగ్నికి ఆహుతైన ఘటన కేరళలో చోటుచేసుకుంది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం.. ముందు కూర్చున్న వారు తప్పించుకునే అవకాశం లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

Published : 02 Feb 2023 16:25 IST

తిరువనంతపురం: కేరళలో విషాద ఘటన చోటుచేసుకుంది. పురుటినొప్పులతో బాధపడుతోన్న ఓ గర్భిణి ఆస్పత్రికి చేరేలోపే అగ్నికి ఆహుతయ్యింది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తోన్న ఆమె కారు ప్రమాదానికి గురికావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో వెనక సీట్లలో కూర్చున్నవారు తప్పించుకోగా.. ముందు వరసలో ఉన్న గర్భిణితోపాటు ఆమె భర్త మాత్రం సజీవ దహనమయ్యారు. కన్నూరులోని జిల్లా ఆస్పత్రి సమీపంలో జరిగిన ఈ ఘటన ఎంతగానో కలచివేసిందని స్థానికులు పేర్కొన్నారు.

కన్నూర్‌ జిల్లాకు చెందిన ప్రిజిత్‌(35).. భార్య రీషా(26)కు పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కారులో బయలుదేరారు. కన్నూర్‌ ఆస్పత్రికి సమీపంలోకి రాగానే వాహనంలో మంటలు చెలరేగాయి. దీంతో వెనక కూర్చున్న నలుగురు తప్పించుకోగా.. ముందు వరసలో కూర్చున్న రీషా, ఆమె భర్త మాత్రం వెంటనే బయటకు రాలేకపోయారు. ఇది గమనించిన స్థానికులు వాహనం దగ్గరకు పరుగెత్తారు. బయటనుంచి కారు డోరును తెరిచేందుకు యత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో అందరూ చూస్తుండగానే దంపతులు కాలిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. వాహనం ముందు భాగంలో మంటలు ఎక్కువ కావడంతో నిస్సహాయంగా ఉండిపోయామని.. పెట్రోల్‌ ట్యాంకు పేలుతుందనే భయంతో దూరంగా జరిగామన్నారు. కళ్లముందే వారిద్దరూ అగ్నికి ఆహుతయ్యారంటూ వాపోయారు.

విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కారులో మంటలను ఆర్పారు. దంపతులను బయటకు తీసినప్పటికీ.. అప్పటికే వారు చనిపోయినట్లు గుర్తించారు. వెనక సీట్లలో కూర్చున్న వారికి గాయాలు కాలేదని.. వారిని ఆస్పత్రిలో చేర్పించి పరీక్షిస్తున్నామని  పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించారు. కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియలేదని.. నిపుణుల విశ్లేషణ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు