Hyderabad: గడ్డిఅన్నారంలో తల్లిని హత్య చేసిన కుమారుడు.. కేసులో కీలక మలుపు

నగరంలోని గడ్డిఅన్నారంలో కుమారుడు తల్లిని హత్య చేసిన కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కుమారుడు సాయితేజ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

Updated : 12 May 2022 23:12 IST

హైదరాబాద్: నగరంలోని గడ్డిఅన్నారంలో కుమారుడు తల్లిని హత్య చేసిన కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కుమారుడు సాయితేజ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అమ్రాబాద్ మండలం ఈగలపెంటలోని అటవీ ప్రాంతంలో ఉన్న సాయితేజ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సాయితేజను అతని స్నేహితుడు శివ.. తలపై బండరాయితో మోది చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.

వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని సరూర్ నగర్ పీఎస్ పరిధిలోని గడ్డిఅన్నారంలో జంగయ్య, భూదేవీ దంపతులు నివసిస్తున్నారు. వారికి సంతానం లేకపోవడంతో 1995లో సమీప బంధువుల కుమారుడైన సాయితేజను దత్తత తీసుకున్నారు. పెళ్లి వయసు రావడంతో సాయితేజకు వివాహం చేసేందుకు తండ్రి జంగయ్య సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి కోసం రూ. 10 లక్షల నగదు, బంగారు ఆభరణాలు ఇంట్లో పెట్టారు. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన తెల్లవారుజామున భూదేవి అనే మహిళ హత్యకు గురైంది. తండ్రి జంగయ్య ఇంటి కింది ఫ్లోర్‌లో పడుకోగా తల్లి భూదేవి, సాయితేజ మొదటి అంతస్తులో పడుకున్నారు. ఉదయం జంగయ్య మొదటి అంతస్తుకు వచ్చి చూడగా భూదేవి అపస్మారక స్థితిలో ఉంది. భార్య చనిపోయిందని తెలిసి జంగయ్య వెంటనే సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉన్న రూ.10 లక్షలు, 35 తులాల బంగారం మాయమవడం జంగయ్య గుర్తించాడు. జంగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. చేతిలో సంచి పట్టుకొని సాయితేజ ఇంట్లో నుంచి వెళ్తున్న దృశ్యాలను పోలీసులు గుర్తించారు. నగదు, బంగారం కోసం సాయితేజ, తన తల్లి భూదేవి ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. కొన్ని నెలలుగా సాయితేజ చెడు అలవాట్లకు బానిసై స్నేహితులతో తిరుగుతున్నట్లు జంగయ్య పోలీసులకు తెలిపారు. స్నేహితుల ప్రోద్బలంతోనే సాయితేజ తల్లిని హత్య చేసి బంగారు ఆభరణాలు, నగదు తీసుకెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో నుంచి వెళ్లిన సాయితేజ, అతని స్నేహితులు శ్రీశైలం వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మల్లెలతీర్థం చేరుకున్న తర్వాత సాయితేజ స్నేహితుడు శివ.. సాయితేజ తలపై బండరాయితో మోది హత్య చేసి మల్లెలతీర్థం నీటిగుండంలో పడేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సాయితేజను చంపిన శివ ఇవాళ ఉదయం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హత్యకు గురికావడంతో పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఈ మేరకు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు