Post Mortem: పోస్టుమార్టమ్‌కు ముందు లేచి కూర్చున్న ఖైదీ.. అవాక్కయిన వైద్యులు

అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తిచేసిన తర్వాత చనిపోయాడనుకున్న వ్యక్తి లేచికూర్చున్న ఘటనలు చూశాం. మరణించాడనుకున్న వ్యక్తిని చితిపై ఉంచి నిప్పటించే ముందు కళ్లు తెరిచాడనే వార్తలను కూడా విన్నాం.

Updated : 05 Feb 2022 18:19 IST

మాడ్రిడ్ (స్పెయిన్‌): అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తిచేసిన తర్వాత చనిపోయాడనుకున్న వ్యక్తి లేచికూర్చున్న ఘటనలు చూశాం. మరణించాడనుకున్న వ్యక్తిని చితిపై ఉంచినప్పుడు కళ్లు తెరిచాడనే వార్తలను కూడా విన్నాం. అయితే, కాస్త భిన్నమైన ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. శవపరీక్ష చేసే కొన్ని నిమిషాల ముందు ఓ ఖైదీ లేచికూర్చున్నాడు. ఈ ఘటనతో అక్కడున్న వైద్యులు నిశ్చేష్టులయ్యారు.

వివరాల్లోకి వెళితే.. స్పెయిన్‌లో ఉన్నవిల్లాబోనాలోని కారాగారంలో  గొంజలో మోంటోయా జిమెనెజ్ అనే ఖైదీ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతడు ఉన్నట్లుండి  స్పృహ కోల్పోవడంతో అధికారులు లేపటానికి ప్రయత్నించారు. కానీ అతడిలో ఎలాంటి చలనం కనిపించకపోవడంతో జైలులో ఉన్న ఇద్దరు వైద్యులను పిలిపించారు.  పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. ఫోరెన్సిక్ నిపుణుడిని రప్పించి మరోసారి పరీక్షలు చేయించారు. అతడు కూడా ఖైదీ చనిపోయాడని ధ్రువీకరించాడు. దీంతో ఈ విషయాన్ని ఖైదీ కుటుంబసభ్యులకు తెలియజేశారు. మృతదేహానికి శవపరీక్ష చేసేందుకు వైద్యులు మార్చురీ గదిలోకి వెళ్లారు. అక్కడ వారికి పెద్ద గురక శబ్దం వినిపించింది. మృతదేహం ఉన్న బ్యాగ్ లోపలి నుంచి ఈ శబ్దంవస్తోందని తెలుసుకున్నారు. వెంటనే ఆ బ్యాగ్‌ని తెరిచి చూడగా అతడు సజీవంగా ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన వైద్యులు.. హుటాహుటిన ఖైదీని మరో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని జైలు అధికారులు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు