Drugs: కొకైన్ దొరికితే పూర్తి బాధ్యత నిర్వాహకులదే.. బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

పుడింగ్ అండ్‌ మింక్‌ పబ్ కేసులో నిందితులు అభిషేక్‌, అనిల్‌ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుర్గాజీ కోర్టుకు వాదనలు వినిపించారు.

Published : 20 Apr 2022 15:05 IST

హైదరాబాద్: పుడింగ్ అండ్‌ మింక్‌ పబ్ కేసులో నిందితులు అభిషేక్‌, అనిల్‌ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుర్గాజీ కోర్టుకు వాదనలు వినిపించారు. పబ్‌లో కొకైన్ దొరికినప్పుడు పూర్తిగా నిర్వాహకులే బాధ్యత వహించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పబ్ లోకి ప్రవేశించే ముందే ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి పంపిస్తారని.. వినియోగదారులు డ్రగ్స్‌ను లోపలికి తీసుకెళ్లే అవకాశం లేదన్నారు. పబ్ నిర్వాహకులే కొకైన్ విక్రయించేందుకు అవకాశం ఉందన్నారు. దీనిపై పూర్తి వివరాలు సేకరించేందుకు పోలీసులకు మరికొంత సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. నిందితులకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశముందని.. ఆధారాలను తారుమారు చేసే ప్రమాదముందని కోర్టుకు వివరించారు.

బెయిల్‌ పిటిషన్‌పై నిందితుల తరఫు న్యాయవాది మంగళవారం తన వాదనలు కోర్టుకు వినిపించిన విషయం తెలిసిందే. పోలీసులు ఇప్పటికే 4 రోజుల కస్టడీకి తీసుకొని అభిషేక్, అనిల్‌ను ప్రశ్నించారని, కొకైన్ విక్రయానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బెయిల్ మంజూరు చేయాలని, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని న్యాయస్థానానికి తెలియజేశారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం, తీర్పును గురువారానికి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని