Amritsar: తమ నేతను విడిపించేందుకు.. కత్తులు, గన్‌లతో పోలీస్‌స్టేషన్‌పై దాడికి వచ్చారు!

పంజాబ్‌ (Punjab)లో ఓ మత సంస్థ నాయకుడిని అరెస్టు చేసినందుకు అతడి మద్దతుదారులంతా వీరంగం సృష్టించారు. కత్తులు, గన్‌లు, పదునైన ఆయుధాలతో పోలీస్‌స్టేషన్‌ (police Station) ముట్టడికి బయల్దేరారు.

Published : 24 Feb 2023 01:21 IST

అమృత్‌సర్‌: ఓ వైపు భారీ సంఖ్యలో పోలీసులు.. మరోవైపు కత్తులు, తుపాకులు, పదునైన ఆయుధాలతో వందలాది మంది ఆందోళనకారులు..మధ్యలో బారికేడ్లు..ఈ సీన్‌ చూస్తుంటే.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా అనుకునేరు. పంజాబ్‌లోని అజ్‌నాలా పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా జరిగిన యదార్థ సంఘటన ఇది. ఈ ఆందోళనకారులంతా.. ఆ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించేందుకు వచ్చారట. ఎందుకో తెలుసా?

ఆ ఆందోళనకారులంతా పంజాబ్‌లోని ‘వారిస్‌ పంజాబ్‌ దే’ మత సంస్థ చీఫ్‌ అమృత్‌పాల్‌ సింగ్‌ అనుచరులు. అమృత్‌పాల్‌ సింగ్‌ సన్నిహితుడు లవ్‌ ప్రీత్‌ తూఫాన్‌ను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. దీంతో కోపోద్రిక్తులైన అతడి అనుచరులంతా మూకుమ్మడిగా పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించేందుకు వెళ్లారు. మినీ బస్‌పై బారీ సౌండ్‌బాక్సులు పెట్టి.. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. మారణాయుధాలతో ముందుకు సాగారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు రోడ్డు మధ్యలో బారికేడ్లు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. వందలాది మంది ఆందోళనకారులు వాటిని తోసుకుంటూ ముందుకెళ్లేసరికి పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు.

కేవలం రాజకీయ కుట్రతోనే లవ్‌ప్రీత్‌ తూఫాన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని అమృత్‌పాల్‌ సింగ్‌ ఆరోపించారు. కేవలం గంట లోపు కేసు రద్దు చేయకపోతే తర్వాత ఏం జరిగినా అధికారయంత్రాంగమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘‘మేమేం చేయలేమని వాళ్లనుకుంటున్నారేమో. అందుకే బల ప్రదర్శన చేయాల్సి వచ్చింది’’ అని అమృత్‌పాల్‌ సింగ్‌ వెల్లడించారు.‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థను దీప్‌ సిద్ధూ అనే వ్యక్తి స్థాపించారు. గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందిన తర్వాత సంస్థ బాధ్యతలను అమృత్‌పాల్‌ సింగ్‌ తీసుకున్నారు. తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లవ్‌ప్రీత్‌ తూఫాన్‌ను విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని