Crime news: జాబ్‌ ఇంటర్వ్యూకు పిలిచి.. కారులోకి ఈడ్చుకెళ్లి యువతిపై దారుణం

ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ యువతి జీవితాన్ని నాశనం చేశాడో దుర్మార్గుడు. యువతికి మత్తుమందు కలిపిన నీటిని ఇచ్చి స్పృహకోల్పోగానే కారులోకి ఈడ్చుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు.

Published : 15 Feb 2023 01:39 IST

గురుగ్రామ్‌: హరియాణా(Haryana)ని గురుగ్రామ్‌లో దారుణం చోటుచేసుకుంది. బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఓ యువతిని ఇంటర్వ్యూ కోసం పిలిచిన ఓ వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. నగరంలోని ప్రముఖ షాపింగ్‌ మాల్‌ పార్కింగ్‌ లాట్‌లో ఈ దుర్మార్గం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుషార్‌ శర్మ అనే వ్యక్తి ఇంటర్వ్యూ(job interview)కు రావాలని పిలిచి తనపై అత్యాచారం చేసినట్టు 27 ఏళ్ల యువతి ఆరోపించింది. సహారా షాపింగ్‌ కాంప్లెక్స్‌ దగ్గరకు వచ్చి తనను కలవాలని పిలవగా.. తాను అక్కడికి వెళ్లినట్టు బాధితురాలు తెలిపింది. అప్పటికే కుట్ర పన్నిన నిందితుడు.. షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని పార్కింగ్‌ లాట్‌ వద్దకు తీసుకెళ్లి కారులోకి బలవంతంగా ఈడ్చుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్టు వాపోయింది. 

ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు..

‘తొలుత ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా యువతికి ఇంటర్వ్యూ కాల్‌ వచ్చింది. తుషార్‌ మెహతా అనే వ్యక్తిని సంప్రదించాలని సమాచారం అందింది. అతడికి ఫోన్‌ చేయగా.. ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఆమెను  సహారా మాల్‌కు రావాలని సూచించాడు. ఆమెను మాల్‌ బయట కలిసి పార్కింగ్ లాట్‌లోకి తీసుకెళ్లాడు. అక్కడ యువతికి మత్తుమందు కలిపిన నీటిని తాగేందుకు ఇచ్చాడు. అనంతరం ఆమెను కారులోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో బాధిత మహిళ సెక్టార్‌ 51 పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం’ అని పోలీసులు తెలిపారు. ఇంటర్వ్యూకు అవసరమైన డాక్యుమెంట్లు తీసుకొని మాల్‌ వద్దకు చేరుకోగానే.. గేటు వద్ద అతడు తనను కలిసినట్టు యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. అక్కడి నుంచి తనను పార్కింగ్‌ లాట్‌కు తీసుకెళ్లాడని.. నీళ్లు తాగిన అనంతరం తాను స్పృహ కోల్పోగా బలవంతంగా కారులోకి ఈడ్చుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడని యువతి వాపోయింది. ఆ తర్వాత తనను అక్కడే వదిలేసి కారులో పరారయ్యాడని పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని పోలీసులకు తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం మాల్‌ వద్ద సీసీటీవీ ఫుటేజీల కోసం ప్రయత్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని